శంకరపట్నం,ఆగస్టు 8: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రుణమాఫీ సెగ తగిలింది. గురువారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం రైతు వేదికలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే హాజరు కాగా.. రుణమాఫీకాని రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆయనకు ఫిర్యాదు చేశారు. తాము మొలంగూర్ ఇండియన్ బ్యాంకులో రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు రుణం తీసుకున్నట్టు చెప్పారు. రెండు దఫాలుగా రుణమాఫీ అయినా తమకు కాలేదని వాపోయారు. అందులో రూ.27 వేల రుణం కూడా మాఫీ కాలేదని రాజయ్య అనే రైతు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చాడు. ఇండియన్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బ్యాంకు సిబ్బందితోపాటు వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు వెంటనే రుణమాఫీ జరిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.