దేవరుప్పుల, మే 29: జనగామ జిల్లా గొల్లపల్లి వాగు నుంచి ఇసుక తరలింపును బుధవారం రైతులు అడ్డుకున్నారు. పాలకుర్తి రిజర్వాయర్‌కు 5000 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా అనుమతివ్వగా కాంట్రాక్టర్ వాగులో పొక్లెయిన్లు పెట్టి ట్రాక్టర్లలో నింపి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న దేవరుప్పుల, గొల్లపల్లి రైతులు ఎట్టి పరిస్థితిల్లోనూ ఇసుకను తరలించేది లేదని, ఇసుక పోతే నీరు నిల్వ ఉండదని, తమ వ్యవసాయ భూములను పడావు పెట్టాల్సి వస్తుందని రైతులు అడ్డుకున్నారు. ఈ రెండు గ్రామాలకు చెందిన రైతులతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పార్టీలకతీతంగా పొక్లెయిన్ మెషిన్లను వాగు నుంచి తరలించాలని పట్టుబట్టారు. రిజర్వాయర్ కాంట్రాక్టర్, సిబ్బందితో వాదనకు తిగారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు రైతులకు నచ్చజెప్పారు. మరోమారు వస్తే ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.