గార్ల, జూన్ 10 : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల పంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరుకాగా.. గార్ల పెద్ద చెరువు శిఖం భూమికి ట్రెంచ్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయలేదంటూ రైతులతో కలిసి విపక్ష పార్టీల నాయకులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో సదస్సు గందరగోళంగా మారింది.
గార్ల పెద్దచెరువు శిఖం భూమి సర్వే నంబర్ 766లో సుమారు 150 ఎకరాలకుపైగా కబ్జాకు గురైందని, కొందరు రైతులు భూమిని కబ్జా చేసి రెవెన్యూ అధికారులకు కాసులు చెల్లించి పట్టాలు చేయించుకున్నారని వారు ఆరోపించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన భూమిని సర్వే చేసినా.. ట్రెంచ్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయలేదని వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పెద్ద చెరువులో కొందరు రైతులు బావులు తవ్వి, విద్యుత్తు మోటర్లు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే హద్దులు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.