Telangana | హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్నదాతల ఆశల సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. అనాలోచిత నిర్ణయాలు, కక్షసాధింపు రాజకీయాలతో ప్రాజెక్టులను పడావు పెట్టడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి బోర్లు, బావులు ఒట్టిపోతున్నాయి. మొన్నటి వరకు మూడు నాలుగు ఎకరాలకు నీరందించిన బోరు ఇప్పుడు అరెకరం తడపడమే గగనమైపోతున్నది. సర్కారు సృష్టించిన ఈ సాగునీటి కష్టాలతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
కండ్లముందే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మళ్లీ పాతరోజులకు మళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో బోర్లు, బావులు వేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బోరు బావులు తవ్వుతున్నారు. కష్టమైనా సరే అప్పులు చేసి మరీ కొత్తగా బోర్లు, బావులు తవ్విస్తున్నరు. దీంతో గ్రామాల్లోకి బోరు బండ్లు క్యూకడుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా భూమికి చిల్లులు పొడుస్తున్నయి.
ఏ గ్రామంలో చూసినా బోరు బండ్ల చప్పుళ్లు వినపడుతున్నాయి. పంటలు ఎండిపోయి, పెట్టుబడులు రాక అప్పులే దిక్కువుతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా సాగు నీళ్ల కోసం నిశ్చింతగా ఉన్న రైతన్నకు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కరువు ఛాయలు చూపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కాంగ్రెస్ సర్కారు వచ్చింది.. కరువు తెచ్చింది’ అంటూ ఊరూరా రైతులు తిట్టిపోస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక చెరువులు, కుంటలను నీళ్లతో నింపడమే మానేసింది. ఫలితంగా బోరు బావుల్లోకి నీళ్ల ఊటలు బంద్ అయి ఒట్టిపోతున్నాయి. దీంతో పంటలకు నీళ్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు మళ్లీ కొత్తగా బోర్లు, బావులు తవ్విస్తున్నారు.
ఒక్కో రైతు తన భూమి, స్థోమతను బట్టి 2 నుంచి 5 బోర్లు వేయిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామంలో సగటున 8 నుంచి 10 బోర్ల చొప్పున వేసినట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత నెల రోజుల్లో ఒక్కో ఊరిలో సగటున కొత్తగా 30 నుంచి 40 బోర్లు వేసినట్టు బోర్ బండి యజమానులే చెప్తున్నారు. ఈ లెక్కన నెల రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష బోర్లు వేసినట్టు బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఇంకా కొత్త బోర్ల సంఖ్య రెట్టింపు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెలరోజుల్లో 150 నుంచి 200 బోర్లు వేసినట్టు ఓ బోరుబండి యజమాని చెప్పడం తీవ్రతకు అద్దంపడుతున్నది.
రైతులు పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నప్పటికీ రైతులు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. బోర్ల సక్సెస్ రేటు 20-30 శాతం మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఒక గ్రామంలో 5 బోర్లు వేస్తే అందులో ఒకటి లేదా రెండు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 500 అడుగుల లోతు వేసినా ప్రయోజనం ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పడిన కొన్ని బోర్లలో కనీసం ఒక్క ఇంచు నీళ్లు కూడా పడటం లేదు. దీంతో ఆ బోరులో నీళ్లు పడినా.. ప్రయోజనం ఉండటం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త బోర్ల కోసం రైతులు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు ఓ అంచనా. ఒక్కో బోరుకు కనీసం రూ.30-50 వేలు ఖర్చవుతుంది. నీళ్లు పడకుంటే మిగిలేది అప్పులే. పడితే మోటరు, పైపులు, వైరు, ఇతర ఖర్చులు కలిపి రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రతి రైతు సగటున 250 ఫీట్ల నుంచి 500 ఫీట్ల వరకు బోర్లు వేయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో రైతు కొత్త బోర్ల కోసం కనీసం రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా. ఈ విధంగా ఒక్కో బోరుకు ఖర్చు సగటున రూ.50 వేలుగా లెక్కిస్తే, ఇప్పటికే లక్ష బోర్లు వేసినట్టు అంచనా. అంటే సాగు నీళ్ల కోసం పరితపిస్తున్న రైతులు ఈ రూ.500 కోట్లను అప్పులు, రుణాలుగా తీసుకొని బోర్లకు పెట్టడం సంచలనంగా మారింది.
బీఆర్ఎస్పై కక్షతో కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో చెరువులు, కుంటలకు నీళ్లు కరువయ్యాయి. చెరువులపై ఆధారపడ్డ బోర్లు, బావులు ఎండిపోయాయి. వెరసి పంటలకు నీళ్లు కరువయ్యాయి. రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. వేసవి ప్రారంభంలోనే భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళనకరం. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అన్నదాత విలవిల్లాడుతున్నారు. చేతకొచ్చే దశలో పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వదులుతున్నారు. సర్కారు నిర్లక్ష్య వైఖరితో ఈ వేసవిలో రాష్ట్ర రైతాంగం సాగునీటి కోసం అరిగోస పడుతున్నది.
ఎల్లారెడ్డిపేట, మార్చి 6: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గ్రామాలకు పదేండ్ల నుంచి ఏ కరువు లేదు. ఈసారి సాగు నీళ్లు లేక మండల రైతులు విలవిల్లాడుతున్నాయి. మండలంలోని బుగ్గరాజేశ్వరతండా, గుంటపల్లి చెరువుతండా, కిష్టూనాయక్ తండా, రాజన్నపేట, దేవునిగుట్ట తండా, గొల్లపల్లి, బాకుర్పల్లి, తిమ్మాపూర్లో 180 ఎకరాల్లో నీటి ఎద్దడి సమస్య ఉన్నట్టు అధికారిక అంచనా. పలువురు రైతులు లక్షలు పెట్టి బోర్లు వేయిస్తున్నరు. అయినా ఫలితం దక్కడం లేదు. ఇంకొందరు పంటలెండిపోయి పశువులను మేతకు విడిచిపెట్టారు. ‘నేను రెండు లక్షలు పెట్టి మూడు బోర్లేసిన. మొత్తం ఫెయిలైపోయినయ్. కేటీఆర్ సార్ మొన్న దేవునిగుట్ట తండాకు వచ్చి నీళ్లియ్యకుంటే ధర్నా చేస్తమనేసరికి కాల్వల్ల నీళ్లచ్చినయ్. ఈ నీళ్లు రాకపోతే మొత్తం మునుగుడయితుండె. బోర్ల అప్పులే మిగిల్నయ్’ అని బుగ్గరాజేశ్వర తండాకు చెందిన బానోత్ రాజునాయక్ తెలిపారు.
నాలుగెకరాల పంట ఎండిపోతుంటే సూడలేకపోయిన. బోరు బండి రావడానికే 10 గుంటల పంట పొలాన్ని చెడగొట్టి తొవ్వ జేసేందుకు రూ.20 వేలు ఖర్చు చేసిన. అక్కడ రూ.1.10 లక్షలు పెట్టి పాత బోరు స్థలంలో కొత్త బోరేసిన. అయినా నీళ్లు పడలె. సూడబుద్దిగాక మల్లొక్క దగ్గర రూ.90 వేలు పెట్టి 650 ఫీట్ల బోరేయించిన. సుక్క నీళ్లు రాలె. పొలానికి కాల్వ నీళ్లే దిక్కని మల్లొక రూ.లక్ష పెట్టి పైపులు తెచ్చి మల్కపేట కాల్వకేసిన. ఇప్పుడైతే నీళ్లు రాలె. వస్తన్నయంటున్నరు. ఎంత జేసినా నాకున్న నాలుగెకరాల్లో రెండెకరాలు ఎండిపోయేట్టున్నది.
– భూక్యా మోహన్, రైతు, దేవునిగుట్ట తండా, ఎల్లారెడ్డిపేట