అడ్డగూడూరు, సెప్టెంబర్ 28: రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే తిరగబడుతామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ను రైతులు హెచ్చరించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో విండో కార్యాలయంలో నిర్వహించిన పీఏసీస్ సర్వసభ్య సమావేశానికి హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉందని రైతులను అడిగారు. మండల కేంద్రానికి చెందిన రైతు బైరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షలపై ఉన్న రైతులు ఆ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే అక్కడున్న రైతులు రూ.2 లక్షల పైన ఉన్న డబ్బులు అప్పుడే కట్టామని తెలుపడంతో కొంచెం సమయం పడుతుంది చెప్పారు. విండో చైర్మన్ కొప్పుల నిరంజన్‌రెడ్డి రూ.1.50 కోట్లు వస్తే తమ సంఘం పరిధిలోని రైతులందరికీ మాఫీ వర్తిస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి అడ్డగూడూరు సింగిల్‌విండోకు రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీంతో ఆయన వచ్చే నెల 3 తర్వాత మంజూరు చేస్తానని సమాధానమిచ్చారు.
అసంపూర్తిగా రుణమాఫీ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన రైతు రుణమాఫీని అసంపూర్తిగా చేసిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కౌన్సిల్ అభిప్రాయపడింది. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొదటి సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని కోరుతూ అక్టోబర్ 21న అజాద్ హింద్ దివస్ పార్టీ తరఫున కార్యాచరణ చేపట్టాలని తీర్మానించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోత్సహించడం రాహుల్‌గాంధీ ఆశయాలకు, ఇండియా బ్లాక్ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర కౌన్సిల్ అభిప్రాయపడింది.