వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల గడుస్తున్నా ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 16జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమై అన్నదాతను కలవర పెడుతున్నది.
Telanana | హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ): మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు సంబురపడ్డారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని మురిసిపోయారు. కానీ ఆ మురిపెం ఆవిరైంది. జూన్ మొదట్లో వర్షాలు కురిసి తర్వాత పత్తా లేకుండాపోయాయి. ఇప్పటి వరకు 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది.
వ్యవసాయం, అడవుల విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాల్లోనూ లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. ఈ సీజన్లో జూన్లో కురవాల్సిన వర్షం మే నెలలోనే కురిసింది. ఎర్రని ఎండలు దంచాల్సిన మే నెలలో 128శాతం అధిక వర్షం కురిసినట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. 24 జిల్లాల్లో అత్యంత ఎక్కువగా(లార్జ్ ఎక్సెస్) వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఐదు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
వర్షాలు ఆలస్యం అవుతుండడంతో సీజన్ ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి భూములను సిద్ధం చేసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూన్లో కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వర్షాలు ఆలస్యమై ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వర్షాధార పంటలైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర వంటి పంటల్ని రైతులు 60-75 మిల్లీ మీటర్ల వర్షాపాతం కురిసిన తర్వాతే విత్తుకోవాలి. అదే విధంగా ఆ పంటలు వేసే భూమి 15-20 సెం.మీలో తడిసన తర్వాత మాత్రమే విత్తనాలను వేయాలి. రైతులు ముందే వేయడంతో ఇటు వర్షాలు లేకపోవడం, అటు భూమి లోపలి వేడితో విత్తనాలు పాడైపోతున్నాయి. రైతులకు పెట్టుబడి నష్టం మీదపడుతున్నది. మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.