కమ్మర్పల్లి, జులై 11: కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీలోకి కాళేశ్వర జలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ జలసిరులను చూసి తరించేందుకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్, కమ్మర్పల్లి గ్రామాల రైతులు ఆరు బస్సులు, కార్లలో ముప్కాల్ పునరుజ్జీవ పథకం పంప్‌హౌస్‌ను సందర్శించారు. పంప్‌హౌస్ నుంచి నాలుగు పంపుల ద్వారా భారీ గా అప్రోచ్ కాలువలోకి దూకే దృశ్యాన్ని చూసి సంబురపడ్డారు. అప్రోచ్ కాలువలో పరవళ్లు తొక్కుతూ ఎస్సారెస్పీ తీరంలోకి వెళ్తున్న తీరును తిలకించి పులకించిపోయారు. కాళేశ్వర జలాలను తెచ్చి రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మేలును ఎన్నటికీ మరువలేమని రైతులు పేర్కొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సొంత ఖర్చులతో సందర్శనకు వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు.