నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 24 : తూకంలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులు దాటినా కాంటా పెడ్తలేదని మండిపడుతున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. వడ్లను తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల వద్ద హనుమకొండ – సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సిద్ధంగా ఉన్నా మిల్లర్లు సహకరించకపోవడంతోనే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు మండిపడ్డారు.
వారాల తరబడి పడిగాపులు కాస్తున్నామని, ఎండలు, అకాల వర్షాలకు సతమతమవుతున్నామని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ ఆదివారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లితండాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ 30 రోజులుగా పడిగాపులు కాస్తున్నా కాంటా వేయడం లేదని మండిపడ్డారు. తహసీల్దార్, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటివరకు 30 శాతం మాత్రమే కొనుగోలు చేశారని మండిపడ్డారు. ధాన్యం తరలించి వారాలు గడుస్తున్నా కొనడం లేదని ఆగ్రహించిన రైతులు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో రాస్తారోకో చేపట్టారు. రైతులు మాట్లాడుతూ.. వడ్లు కొనకపోవడంతో తాము కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది రైతుల ధాన్యం కాంటా వేసినా లారీలు రావడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ యార్డులో అదనపు వసూళ్లను నిరసిస్తూ యార్డు నుంచి లారీలు బయటకు వెళ్లకుండా మెయిన్ గేటుకు రైతులు తాళం వేశారు. ఈ క్రమంలో లారీ ఓనర్లు, రైతులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. పలువురు రైతులు మాట్లాడుతూ మక్కలు, ధాన్యం బస్తాల తరలింపునకు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నదని, ఉచితంగా తరలించాలని అధికారులు చెప్పినా లారీల యజమానులు తమ వద్ద డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. లారీ యజమానులతోపాటు హమాలీలు డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు.

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో కొనుగోలు చేసిన మక్కజొన్నలను అన్లోడ్ చేసేందుకు హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడూరు మండలం ఇంద్రకల్ సమీపంలో మహాలక్ష్మీ రైస్ మిల్, ఐతోల్ సమీపంలో ఓంకార్ రైస్ మిల్, కొమ్ముగుట్ట తండాలోని మిల్లుల దగ్గర లారీలు, ట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా కిలో మీటర్ల మేర బారులు తీరాయి. హమాలీల కొరతతో ధాన్యాన్ని దించలేకపోతున్నట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు.
– నాగర్‌కర్నూల్