మహబూబ్‌నగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అకాల వర్షాలకు పం టలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం చేకూరిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.10 వేలు అందించాలన్నారు. ఈదురుగాలులకు తోడు వడగండ్ల వర్షం పాలమూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మహబూబ్‌నగర్ మండలం చౌదర్పల్లి, జమిస్తాపూర్, కోడూరు, బొక్కలోనిపల్లి, హ న్వాడ మండలంలోని కొనగంటిపల్లి, నాయినోనిపల్లి, యారోన్పల్లి, సల్లోనిపల్లి, హన్వాడ, మూసాపేట మండలంతోపాటు భూత్పూర్, అడ్డాకులలో పెద్దఎత్తున వరి పంట నేలకొరిగింది.
ఆదివారం శ్రీనివాస్‌గౌడ్ పలుచోట్ల క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నదని మండిపడ్డారు. వడగండ్ల వాన పడి పంటలు నష్టపోతే అధికారులు ఎక్కడున్నారు? ప్రశ్నించారు. కనీసం రైతులను ఓదార్చడానికి ఎవరు రాలేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని డిమాండ్ చేశారు.