గట్టు/మోతె, సెప్టెంబర్ 1 : నిరంతర విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పంటలు నీరందక ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు, సూర్యాపేట జిల్లా మోతె మండలం లాల్తండా సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సాగుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్తోపాటు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ.. సాగుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సాగుకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోతల్లేని కరెంటు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని లాల్ తండా సబ్స్టేషన్ వద్ద మోతె, బీక్యా తండాల రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడో పోతదో తెలియడం లేదని అన్నారు. తరచూ కరెంటు కోతలు విధిస్తే పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.