మహబూబ్ నగర్ : అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్స్టేషన్ ( Sub Station ) సమీపంలో ఆందోళనకు ( Farmers Protest ) దిగారు. వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టారు. రైతులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు 13 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. . కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో రైతులతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కే మాణిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ధర్మనాయక్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ డేగ మహేష్ రెడ్డి, నాయకులు రవి ప్రకాష్ రెడ్డి, నారాయణ నాయక్, శంకర్ నాయక్, టికె నాయక్, సర్పంచ్ పద్మ వెంకటయ్య, మాజీ సర్పంచ్ బాలకృష్ణ, మహేష్, అంజి, రూప్ల నాయక్, గోవిందు నాయక్,శివ,ఆనంద్, తులసి రామకృష్ణ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు .