జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలోని కోలన్పల్లి, మల్లంపల్లిలో జేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును 15 సంవత్సరాల కిందట ప్రారంభించినా.. కాంగ్రెస్ పాలనలో పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పనులు ప్రారంభించినప్పటికీ.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మూడేళ్లు ఆలస్యమైందన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలంటే భూసేకరణకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు కింద 9,780 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. 142 ఎకరాలు భూసేకరణ కావాల్సి ఉందని, 247 మంది రైతులు భూమిని కోల్పోతున్నారన్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూసేకరణ తక్కువగా ఉందని, రైతులకు ఇబ్బంది లేకుండా వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒక్కో ఎకరానికి రూ.4.5లక్షలు వస్తుండగా.. సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.9లక్షలకు పెంచినట్లు చెప్పారు. భూసేకరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఖచ్చితంగా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. భూమికి పరిహారంతో పాటు ఆ భూమిలో చెట్లు, భూములు, కట్టడాలు ఉంటే వాటికి అదనపు పరిహారం లభిస్తుంది అన్నారు. కాబట్టి రైతులు ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.
ఈ ప్రాంతానికి దేవాదుల నీరు రావడం ద్వారా సస్యశ్యామలం కావడానికి తోడ్పడాలన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఉచిత కరెంటు, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అమలు చేస్తున్నారని, దీంతో రైతుల జీవితాలు బాగవుతున్నాయన్నారు. భూముల ధరలు సైతం పెరుగుతున్నాయన్నారు. పాలకుర్తిలో ఎకరం రూ.కోటి ధర పలుకుతుందంటే సీఎం కేసీఆర్ వలేనన్నారు. సమావేశాల్లో కలెక్టర్లు గోపి, శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవోలు కృష్ణవేణి, రమేశ్, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.