సైదాబాద్, నవంబర్13: లగచర్ల ఘటనలో అరెస్టు అయిన రైతులందరినీ విడుదల చేయాలని సేవాలాల్ బంజారా వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘ఫార్మా కంపెనీల పేరుతో గిరిజన భూములను లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికే ఇలా చేస్తున్నది. ఈ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన రైతులందరినీ విడుదల చేయాలి. లేకుంటే గిరిజన సంఘాలన్నీ ఏకమై రేవంత్ సర్కార్‌పై పోరాటానికి సిద్ధమవుతాయి’ అని హెచ్చరించారు. లగచర్ల, పులిచెర్లలో పోలీసులు దాడులు చేయడంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏంచెయ్యాలో దిక్కుతోచని గిరిజనలు బంధువుల ఇండ్లలో తలదాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఆయనకు గిరిజనులపై ఎంతప్రేమ ఉన్నదో అర్థమవుతున్నదని మోతీలాల్ పేర్కొన్నారు.