Telangana | బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవును నిజమే’నంటూ మాట కలిపారు. కాంగ్రెస్ హామీలిచ్చి తప్పింది నిజం కాదా? అని కేసీఆర్ నిలదీసిన ప్రతి సందర్భంలోనూ ముమ్మాటికీ నిజమేనంటూ ప్రతిస్పందించారు. సమైక్య పాలనలో తెలంగాణ ఎంతటి వివక్షకు గురైందో, తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందో చెప్పినప్పుడు నాటి పరిస్థితులను తలుచుకుంటూ మథనపడ్డారు.
ఆదివారం.. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. అక్కడే ఉన్న ఓ రైతు కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్ధగా వినడమే కాదు.. ఆయన మాటలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ.. ప్రతిస్పందించారు.
కేసీఆర్ : కరంటు కోసం 35 ఏండ్లు బాధపడ్డం. నా బాయికాడ కూడా మోటర్లు కాలినయి. కానీ బీఆర్ఎస్ వచ్చినంక, నేను ముఖ్యమంత్రి అయినంక ఒక్క యాడాదిల కరంటు బాధలు పోలేదా.. మోటర్లు నడవలేదా?
రైతు : నడిశినయి
కేసీఆర్ : రెప్పపాటు కరంటు పోకుండా 24 గంటలు ఇయ్యలేదా?
రైతు : నిమిషం కూడా పోలే.
కేసీఆర్ : మా అంత శిపాయిలు లేరనేటోళ్లకు కేసీఆర్ మంచిగ ఇచ్చిన కరంటు మీకెందుకు ఇయ్యశాతనైతలేదని అడుగుతున్న.
రైతు : వాడు ఇయ్యడు.. ఆ రేవంత్రెడ్డి ఇయ్యడు.
కేసీఆర్ : ఎందుకు ఇయ్యాల ప్రజల గోస పుచ్చుకుంటున్నరు?
రైతు : అవును.
కేసీఆర్ : మోటర్లు కాలుతున్నయి.. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నయి.
రైతు : అవును.. కాలుతున్నయి.
కేసీఆర్ : లంచాలు పెరుగుతున్నయి.
రైతు : అవును.
కేసీఆర్ : పని శాతనైతలేదా?
రైతు : అయితలేదు.
కేసీఆర్ : రైతులు మల్లా తెల్లారంగ పోవాల్నా మోటర్లు పెట్టనీకి.
రైతు : అవును.
కేసీఆర్ : ఏం దౌర్భాగ్యం ఇది.
రైతు : వాళ్లు పోతేనే భాగ్యం.. మల్ల కేసీఆర్ వస్తేనే మా కష్టాలు పోతయి.
కేసీఆర్ : భూముల ధరలు ఎటుపోయినయి.
రైతు : పొయినయ్.
కేసీఆర్ : కరంటు ఎవడు ఎత్తుకపోయిండు?
రైతు : దొంగలు.. ఎనుక నుంచి ఎత్తుకపోయిండ్రు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది ఆ ఒక్క రైతు స్పందనే కాదు.. ఎల్కతుర్తి సభకొచ్చిన లక్షలాది మంది రైతుల స్పందన. వారే కాదు.. యువత, మహిళలు, పెద్దలు, వృద్ధులు.. కేసీఆర్ ప్రసంగానికి ఫిదా అయ్యారు. సమైక్య పాలనలో ఈ ప్రాం తం ఎలా వివక్షకు గురైందో, ఎందుకు ఉద్య మం ఎత్తుకోవాల్సి వచ్చిందో చెప్పినప్పుడు నాటి పరిస్థితులను తలుచుకొని వారి గుండెలు బరువెక్కాయి. ‘ఎట్లుండే నా తెలంగాణ.. ఎట్లయింది నా తెలంగాణ’ అనుకుంటూ మథనపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి చెందిన తీరును ప్రత్యక్షంగా చూసిన కండ్లతోనే, 16 నెలలుగా జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయిన ప్రజలకు ఎల్కతుర్తి సభతో భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి.