ఇల్లంతకుంట: కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. భూ సేకరణ పూర్తయినప్పటికీ ఇంకా కాలువ నిర్మించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ పనులు త్వరితగతిన చేపట్టి సాగు నీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, రామోజిపేట, చిక్కుడేవానిపల్లె, తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్, బాలమల్లుపల్లె, ఎడ్లోనికుంటలకు చెందిన రైతులు పెద్దలింగాపూర్ గ్రామసమీపంలో సోమవారం నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఎల్ఎం 6 కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, భూసేకరణలో జాప్యం వల్ల పనులు నిలచిపోయాయని రైతులు వెల్లడించారు. దీంతో దాదాపు 7 గ్రామాల రైతుల పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. కాలువ పనులు పూర్తిచేసి సాగునీటిని అందించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పనులు పూర్తిచేయాలని, తమకు స్పష్టమైన హమీ లభించే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కేటీఆర్ సూచనతో కదిలిన యంత్రాంగం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో రంగనాయకసాగర్ అధికారులు కదిలారు. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనను రంగనాయకసాగర్ నుంచి నీళ్లు ఇప్పియ్యాలని తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, నేరెల్ల, చిన్నలింగాపూర్, రామచంద్రాపురం, దాచారం రైతులు కోరిన విషయం తెలిసిందే. స్పందించిన కేటీఆర్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి నీళ్లు అందించాలని సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా జకాపూర్లోని రంగనాయకసాగర్ కాల్వను ఎస్ఈ రవీందర్, అధికారులు తంగళ్లపల్లి మండల రైతులతో కలిసి సందర్శించారు. రంగనాయక సాగర్ కాల్వ నుంచి జిల్లెల్ల వరకు నీటి సరఫరా చేస్తామని, కాలువలో భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్లో ఉన్న పరిహారం రూ.55 లక్షలు త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.