హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రేడియల్ రోడ్డుకు రైతులు రెడ్ సిగ్నల్ వేసినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి ప్రతిపాదిత రోడ్డు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. కానీ పరిహారం విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తే భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్తున్నారు. దీంతో రేడియల్ రోడ్డుపై కసరత్తు ముందుకు సాగడంలేదు.
రంగారెడ్డి జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా భూముల ధర ఎకరాకు కోటి రూపాయల వరకు పలుకుతున్నదని, రోడ్డు, హైవేకు దగ్గరగా ఉంటే మరింత ఎక్కువగా నడుస్తున్నదని యజమానులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం రేడియల్ రోడ్డు కోసం సేకరించే భూమికి ఎకరాకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పడమేంటని మండిపడుతున్నారు. దీంతో రేడియల్ రోడ్డు భవితవ్యంపై అధికారుల కసరత్తు అగమ్యగోచరంగా మారింది.
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ను అనుసంధానించేందుకు ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. రేడియల్ రోడ్డుతో ఫ్యూచర్‌సిటీని కూడా కలుపుతామని ప్రకటించింది. దీనికి రతన్‌టాటా రోడ్డుగా పేరు కూడా పెట్టింది. సుమారు రూ.4,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో రెండు దశల్లో రేడియల్ రోడ్డును నిర్మించే బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించింది. 330 అడుగుల వెలడల్పయిన రోడ్డు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో సుమారు 1,000 ఎకరాల భూసేకరణకు రెవెన్యూశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
కానీ రైతులు ఎకరాకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందేనని, లేకపోతే భూములు ఇవ్వబోమని చెప్తున్నారు. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సర్కారు చెప్తున్న ధరకు యజామానులు భూములు ఇవ్వడంలేదని, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో చెప్తామని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడతామని చెప్తున్నారు.