పరకాల, సెప్టెంబర్ 14 :యూరియా కోసం క్యూలైన్లు.. తప్పని చెప్పుల వరుసలు.. పొద్దంతా నిల్చున్నా దొరకని సంచులు.. రైతుల నిరసనలు.. అక్కడక్కడా ఆగ్రహ జ్వాలలు.. ఇప్పటికీ ఇవి నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా రైతు కుటుంబాలు యూరియా కోసం ఎక్కడికక్కడ క్యూలైన్లు కట్టారు. మంత్రి సీతక్క స్వగ్రామంలో పెద్ద ఎత్తున రైతులు క్యూకట్టగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కూ యూరియా కష్టాలు తప్పలేదు. ఆమె కూడా రైతుల క్యూలైన్లో నిల్చోగా, ఒక్కటే బస్తాను అధికారులు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం వెళ్తుండగా ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఒక్కబస్తా కోసం పనులు మానుకొని రైతులు పొద్దంతా అష్టకష్టాలు పడుతుంటే.. మరోవైపు అక్రమార్కుల బాగోతం ఒక్కొక్కటీ బయటపడుతున్నది. యూరియాను దారి మళ్లించాడని మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్‌మన్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రి సీతక్క స్వగ్రామంలో రైతుల క్యూములుగురూరల్, సెప్టెంబర్14: రాష్ట్ర మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటలో రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. లారీలో యూరియా రావడంతో అక్కడే ఉన్న రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అబ్బాపురంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే కొరత: నాగజ్యోతి
మంత్రి సీతక్క సొంత గ్రామంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారంటే.., ములుగు జిల్లావ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. ప్రజలు ఇబ్బందిపడుతున్నా రాష్ట్రంలో యూరియా కొరత లేదని మాట్లాడడం సీతక్కకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
యూరియా కొరత వాస్తవమే ; పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ప్రస్తుత సీజన్లో యూరియా కొరత వాస్తమేనని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఒప్పుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తమ అవసరాని కంటే ఎక్కువ యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌లో 18వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 14వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని వెల్లడించారు. యూరియా దొరకని రైతులు నానో యూరియాను పంటలకు స్ప్రే చేసుకోవాలని సూచించారు. రాష్ర్టానికి అవసరమైన యూరియాను సరఫరా చేయించే దిశగా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నదని తెలిపారు.