Runa Mafi | నెల్లికుదురు, ఆగస్టు 22: పదేండ్ల క్రితం ఎరువులు, విత్తనాల కోసం రైతులు తెల్లవారుజామునే షాపుల ఎదుట చెప్పులు వదిలి క్యూలైన్ కట్టేవారు. ఇప్పుడు అవే పరిస్థితులు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ఎస్బీఐ వద్ద గురువారం రుణ మాఫీ కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టి ఉదయం 7 గంటల నుంచి అధికారుల కోసం ఎదురుచూశారు.
వారు వచ్చాక రైతులు బారులు తీరి రుణమాఫీ విషయం తెలుసుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. రోజూ బ్యాంకుకు వస్తున్నా ఫలితం మాత్రం లేదని రైతులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు గ్రామాల వారీగా తేదీలు ప్రకటించకపోవడంతో మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఒకేసారి వచ్చి బ్యాంకు ముందు బారులుదీరారు.
ఎవరు ముందొస్తే వారికే రుణమాఫీ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులపాటు ఆడిట్ పేరుతో రుణమాఫీ డబ్బులు రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు బ్యాంకు వద్ద బారులు తీరారు. దీంతో రుణమాఫీ రెన్యూవల్‌కు సంబంధించి గురువారం ఉదయం 30 మంది మాత్రమే బ్యాంక్ అధికారులు టోకెన్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30 మందికి మాత్రమే రెన్యూవల్ చేస్తే ఇంత మందికి ఎన్ని రోజుల్లో చేస్తారు? బ్యాంకు చుట్టూ ఎన్ని రోజులు తిరగాలి? అని ఆవేదన చెందుతున్నారు. ఎస్బీఐ పరిధిలో సుమారు 2800 మంది రుణం తీసుకుంటే 1200 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని అధికారులు చెప్తున్నారు.