మాగనూరు, డిసెంబర్ 10 : పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 150 మంది రైతులు రోడ్డెక్కారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేటు వద్ద రాయిచూర్ హైవేపై పత్తి లోడ్ ఉన్న ట్రాక్టర్లను ఉంచి బైఠాయించారు. వడ్వాట్ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తిని విక్రయించేందుకు నర్వ, అమరచింత, మరికల్, ధన్వాడ, మక్తల్, మాగనూరు, కృష్ణతోపాటు పలు మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నాలుగు రోజులు గడిచినా పత్తిని కొనుగోలు చేయకపోవడంతో మంగళవారం ధర్నాకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎస్సై అశోక్బాబు చేరుకొని రైతులకు నచ్చజెప్పినా వారు వినలేదు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వచ్చి పత్తిని కొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు.