ఆదిలాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలోని జాతీయ రహదారి-353(బీ)పై బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి జోగు రామన్న రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా ఎగ్గొట్టిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15 వేలు ప్రకటించి ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామనడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించి, ఉపాధి హామీ పనులు చేసే కూలీలు 2023-24 సంవత్సరంలో 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన విధించడం కూడా మోసమేనని ఆయన మండిపడ్డారు.