డిచ్పల్లి, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్‌లో రైతులు గురువారం ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడి మేరకే కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పంట కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించ లేదని, వెంటనే కాంటా చేపట్టేలా చూడాలని ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నేతను పలుమార్లు కోరామని చెప్పారు. తమ ఆవేదనను చెబితే, కోపోద్రిక్తుడైన సదరు నాయకుడు ఒక్క ధాన్యం లారీ కూడా గ్రామం నుంచి వెళ్లకుండా చూస్తానని బెదిరించినట్టు వారు వాపోయారు.
ఫలితంగా అధికారులు కాంటాలు పెట్టడం లేదని తెలిపారు. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ఇన్చార్జి మేనేజర్‌ను నిలదీస్తే.. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడి వల్లే కాంటా పెట్టలేకపోతున్నామని చెప్పాడని రైతులు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ 500 మందికి పైగా అన్నదాతలు గంటకుపైగా రోడ్డుపై బైఠాయించారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.