ఆదిలాబాద్: రుణమాఫీపై (Runa Mafi) రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మూడో విడుతలోనూ తమకు బాంకు లోన్లు మాఫీ కాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. ఓ రైతు ముందు నడుస్తుండగా డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడెను తలమడుగులో ఊరేగించారు. ఈ శవయాత్రలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు.
ఇక పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదంటూ సిద్దిపేట జిట్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రుణమాఫీ జరగలేదని కెనరా బ్యాంక్ ముందు రైతుల ధర్నాకు దిగారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ఇండియన్ బ్యాంక్ ఎదుట రుణమాఫీ కానీ రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. బ్యాంకు షెటర్ మూసి ధర్నాకు చేశారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ అధికారులతో రైతుల వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంకు మేనేజర్ రైతులకు సర్దిచెప్పడంతో శాంతించారు.