నిజామాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రైతులు భగ్గుమన్నారు. మార్కెట్ యార్డు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం, వ్యాపారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. పది రోజులుగా నడుస్తున్న పసుపు బహిరంగ వేలంతో జరుగుతున్న నష్టాలపై ఆందోళనకు దిగారు. ఆన్లైన్లో నిర్వహించాల్సిన పసుపు కొనుగోళ్లను సాంకేతిక సాకుతో బహిరంగ వేలం పాట నిర్వహించడంపై రైతులు తప్పుపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబర్‌ను ముట్టడించేందుకు మూకుమ్మడిగా వెళ్లారు. కార్యాలయంలో కుర్చీలు ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, కలెక్టర్ వచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. తమకు జరుగుతున్న నష్టంపై వివరణ ఇవ్వాలని, తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు ఆందోళన చేస్తున్న రైతుల ఫొటోలు, వీడియోలు సేకరించారు.
ఈ-నామ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. ఈ-నామ్ 2.0 అప్‌గ్రేడేషన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఈ ప్రక్రియను 2025 డిసెంబర్ నాటికే పూర్తి చేసి ఉంటే నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులకు ఇబ్బందులు తలెత్తేవి కాదు. పసుపు కొనుగోలు మొదలవుతున్న క్రమంలో అప్‌గ్రేడేషన్ అంశాన్ని తెర మీదికి తెచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తుతున్నదని పూటకోసారి కొనుగోళ్లను నిలిపేశారు. పాత, కొత్త పద్ధతి పేరుతో తక్కువ ధరకు పసుపు కొనుగోలు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వయంగా జోక్యం చేసుకుని రైతులకు ఇక్కట్లు లేకుండా ఈ-నామ్ 1.0 పద్ధతిలోనే కొనుగోలు చేయాలంటూ చెప్పారు. కానీ ఎంపీ మా టలు మార్కెట్ యార్డులో చెల్లుబాటు కావడం లేదు. బహిరంగ వేలం పాటకే పాలకవర్గం నిశ్చయించింది. పది రోజులుగా బహిరంగ వేలంతో మాయాజాలానికి వ్యాపారులు ఒడిగట్టడంతో రైతులకు తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయి. ఈదోపిడీని అరికట్టాలని పేర్కొం టూ రైతులంతా కలిసి బుధవారం మరోసారి ఆందోళనకు దిగారు. ఈ సీజన్లో పసుపు రైతులు ఆందోళన బాట పట్టడం ఇది రెండోసారి. బహిరంగ వేలం పాట ద్వారా చేస్తున్న దోపీడీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
ఈ-నామ్ 2.0 అప్డేట్ పేరుతో సాంకేతిక సమస్యలు బూచీగా చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆన్లైన్ వేలం పాటను పక్కన పెట్టి భౌతికంగా బహిరంగ వేలం పాట నిర్వాహణకు వ్యాపారులు సిద్ధపడ్డారు. ఈ వ్యవహారంపై నెల రోజుల క్రితమే రైతులు మండిపడ్డారు. ఈ నామ్ పద్ధతిలోనే పసుపు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డులో ధర్నా చేశారు. రైతులంతా కోపోద్రిక్తులు కావడంతో దిగొచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే ఈ-నామ్ 1.0 పాత పద్ధతిలోనే పసుపు కొనుగోలు చేపడుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు ప్రకటనలు గుప్పించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. తీరా పది రోజుల క్రితం నుంచి ఈ-నామ్ వ్యవస్థను పక్కకు నెట్టి, పాత పద్ధతిలో బహిరంగ వేలంపాట నిర్వహించడం మొదలు పెట్టారు. క్వింటా పసుపు ఈ సీజన్ ప్రారంభంలో రూ.12 వేలు నుంచి రూ.13 వేల వరకు లభించింది. బహిరంగ వేలంలో వ్యాపారులు ఇష్టానుసారంగా వేలం పాట నిర్వహించడం మొదలు పెట్టారు. వ్యాపారులు, మార్కెట్ యార్డు అధికారులు కుమ్మక్కు కావడంతో తక్కువ ధరకు పసుపు కొనడం మొదలుపెట్టారు. దీంతో క్వింటా రూ.8 వేలు నుంచి రూ.10 వేలకు పడిపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది.