మనోహరాబాద్, ఆగస్టు 18 : తమకు తెలియకుండా తమ భూమిని వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన బాధితులు మంగళవారం మనోహరాబాద్ తహసీల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. కాళ్లకల్‌కు గ్రామానికి చెందిన వర్గంటి అనంతరెడ్డి, దివంగత వర్గంటి కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల పేరు పై 7.01 ఎకరాల భూమి రికార్డులో ఉంది. ఆ భూమిని వేరే వ్యక్తులపై ఈ నెల 11న రిజిస్ట్రేషన్ చేశారు.
అనంతరెడ్డి, వర్గంటి కిష్టారెడ్డి కుమారులు మంగళవారం మనోహరాబాద్ తహసీల్దార్ ఆంజనేయులును వివరణ కోర గా, పొంతన లేని సమాధానాలు చెప్పాడు. కిష్టారెడ్డి కుమారుడు మల్లారెడ్డి కార్యాలయంలోనే పురుగుల మందు తాగేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకుని దవాఖానకు తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.