హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పుపై బాధిత గ్రామాల రైతులు భగ్గుమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు కొందరు తమ ప్రయోజనాల కోసం మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల సన్న, చిన్నకారు రైతులు ఉన్న ఒకట్రెండెకరాల భూమిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో సర్కారు పెద్దల కమాల్‌పై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ‘పెద్దల కమాల్.. పేద రైతుల భూములు ఢమాల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై గ్రామాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మార్చి న అలైన్‌మెంట్‌ను ఉపసంహరించుకొని, పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని బాధిత గ్రామాల రైతులు, ఆయా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. మరి కొందరు రైతులు నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తంచేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే జేఏసీని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
బయటపెట్టిన ‘నమస్తే తెలంగాణ’
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వెనుక ఉన్న అనేక కుట్ర కోణాలను ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. ప్రధానంగా ‘ముఖ్య’నేత బంధువులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూముల్ని కాపాడేందుకు పేద రైతుల భూముల్లో నుంచి అలైన్‌మెంట్‌ను మార్చినట్టు బయటపెట్టింది. దీంతో బాధిత రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల ప్రాంతాల్లో బాధితులంతా సన్న, చిన్నకారు రైతులే. ప్రభుత్వ పెద్దల కోసం తమకు జీవనాధారంగా ఉన్న భూముల్ని ఎలా గుంజుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ భూముల్ని కాపాడుకునేందుకు ఉమ్మడిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.
కందుకూరు ఆర్డీవోకు వినతిపత్రం
ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్‌మెంట్‌ను మార్చాలని తలకొండపల్లి మండలం చంద్రదాన, కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన అనేకమంది రైతులు కందుకూరు ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కొత్త అలైన్‌మెంట్‌ను ఉపసంహరించుకుని పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.