అయిజ, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ అందరికి చేయాలని పలువురు రైతులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదు ట వరంగల్ డిక్లరేషన్ పత్రాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. సింధనూర్ బ్యాంకులో దాదాపు 2,800 మంది రైతులు రుణాలు తీసుకోగా.. కేవలం 2,100 మందికి రూ.15.50 కోట్లు మాఫీ కాగా మరో 700 మందికి మాఫీ వర్తించలేదని అన్నారు.
ఎన్నికల సమయంలో షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మెలికలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. మాఫీ అయ్యిందా? అంటూ తాము రోజూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మద్దతు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజలను పట్టించుకోవడం మానేసి.. తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడని ఆయన విమర్శించారు.