బచ్చన్నపేట, ఫిబ్రవరి 9: గోదావరి జలాలతో మండలంలో ఎండుతున్న పంటపొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. గోదావరి జలాలతో మండలంలోని చెరువులు, కుంటలను నింపకుండా ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు నీటి తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. వరిపొలాలు పొట్టదశకు వచ్చాయని, ఇప్పుడు నీరందకుంటే పూర్తిగా ఎండిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. గత తొమ్మిదేండ్లు కేసీఆర్ పాలనలో మండలంలోని చెరువులు, కుంటలు నిండుగా ఉండేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటిని నింపాలనే ధ్యాస కూడా ప్రభుత్వానికి లేకుండాపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపి రైతులకు ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, వైస్ చైర్పర్సన్ మద్దికుంట రాధ, నాయకులు సిద్ధి రాంరెడ్డి, నరెడ్ల బాల్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, షబ్బీర్, అజీం, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ముశిని రాజుగౌడ్, కరుణాకర్‌రెడ్డి, కొండి వెంకట్‌రెడ్డి, మధుప్రసాద్, దుర్గాప్రసాద్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.