వడ్డేపల్లి, జనవరి 15 : ఆర్డీఎస్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేసి తమ పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు వడ్డేపల్లి సూరి మాట్లాడుతూ.. వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో వందలాది ఎకరాల్లో వేసిన మక్కజొన్న, మిరప పంటలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.