కల్వకుర్తి, జనవరి 17 : ‘ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదా సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డి దిగిపోవాలి’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినదించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రుణమాఫీ సాధన సమితి కార్యాచరణలో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు సమావేశమయ్యారు. మార్కెట్ యార్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కర్షకులను నమ్మించి మోసం చేసిందని రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు.
ఎన్నికల సమయంలో పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారని, రూ.2 లక్షల రుణమాఫీ.. రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని డిక్లరేషన్లో పెట్టి.. అధికారంలోకి రాగానే రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి రాగా.. ఆయన్ను చూసిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.