Runa Mafi | కొల్లాపూర్ రూరల్, డిసెంబర్ 4 : రుణమాఫీ కోసం రైతులు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొల్లాపూర్‌కు చెందిన రైతు బెమిని కురుమయ్య స్థానిక సహకార బ్యాంకులో గతంలో రూ.1.10 లక్షల రుణం తీసుకున్నాడు. రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని చెబుతున్నా.. ఇతడికి మాత్రం కాలేదు. చివరకు నాలుగో విడతలోనూ మాఫీ వర్తించకపోవడంతో ఆవేదన చెందాడు. బుధవారం వ్యవసాయ కార్యాలయానికి చేరుకొని అధికారి హుస్సేన్ యాదవ్‌ను సంప్రదించాడు. రుణమాఫీ కాలేదని చెప్పడంతో కార్యాలయం ఎదుట 15 నిమిషాలపాటు నిరసన తెలిపాడు. ఎన్నికల సమయంలో మాఫీ చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి మాఫీ చేయకుండా మోసం చేశాడని ధ్వజమెత్తాడు. తాను కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నా మాఫీ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మరో రైతు ఎల్వీ సుబ్బారావు సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనపేరిట రూ.1.30 లక్షలు, తన భార్య పేరిట రూ.1.50 లక్షల లోన్ తీసుకున్నా.. ఇద్దరిలో ఒకరికి కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తాను రెగ్యులర్‌గా రుణాన్ని రెన్యువల్ చేసినా మాఫీ వర్తింపజేయలేదని మండిపడ్డారు.
ఎవ్వలు పట్టించుకుంట లేరు
మా నాన్న పేర ఎల్కేశ్వరంలో ఎకరం ఉంది. మహదేవపూ ర్ బ్యాంక్‌లో రూ.30 వేల పంట రుణం తీసుకున్నం. ఇటీవల ఆయన అనారోగ్యంతో చనిపోయిండు. రూ. 30 వేల రుణం మాఫీ అయితది అనుకున్నం. అసలు రూ. 30 వేలు, వడ్డీ రూ. 17 వేలు కట్టించుకున్నరు. రుణమాఫీ లిస్టులో మా పేరు లేదు. రూ.30 వేల రుణం మాఫీ కాకపోవడం విడ్డూరంగా ఉంది.
– ఆకుల రాజేశ్, రైతు, బెగ్లూర్, మహదేవపూర్, భూపాలపల్లి జిల్లా
మమ్ముల్ని గోసపెడుతున్నరు
భీమదేవరపల్లి: నా పేరు మీద 3.28 ఎకరాలు, భార్య భాగ్యలక్ష్మి పేరు మీద 1.28 ఎకరాల భూమి ఉంది. నేను ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘంలో రూ. 1.35 లక్షలు, నా భార్య రూ. 75 వేల పంట లోన్ తీసుకున్నం. రుణమాఫీ మొదటి విడత నుంచి ప్రాసెస్ జరుగుతుందని వ్యవసాయాధికారులు చెప్తున్నరు. మాకు రుణమాఫీ వస్తదా లేదా అని వ్యవసాయాధికారిని అడిగితే సరైన సమాధానం చెప్తలేడు. సహకార సంఘంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంట రుణం రెన్యువల్ చేస్తాం.
– జక్కుల భాగ్యలక్ష్మీరాజు, ముల్కనూరు, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా
టెక్నికల్ సమస్య అంటున్నరు
డోర్నకల్: గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాకు రూ. 85 వేలు రుణం మాఫీ చేసింది. ఇప్పుడు క్రాప్ లోన్ రూ. 1,60,000 ఉన్నది. రుణం మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల వరకురుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నది. నాకు ఇంకా మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులను అడిగితే టెక్నికల్ సమస్య అంటున్నరు. బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న. ఎవరికి రుణమాఫీ కాలేదో వ్యవసాయ అధికారులతో ఇంటింటా తిరిగి సర్వే చేయాలి.
– దాసరి మల్లేశం, రైతు, డోర్నకల్, మహబూబాబాద్
అధికారులను కలిసినా ఏం చెప్తలేరు
2019లో మంథని ఏడీబీ ఎస్బీఐలో 95 వేలుక్రాప్ లోన్ తీసుకున్న. ఏటా రెన్యువల్ చేస్తున్న. రెండు దఫాల్లో రుణమాఫీ కాలేదు. అధికారులను అడిగితే ఆన్లైన్లో ప్రాసెస్‌లో ఉందని చెప్తూ వచ్చిన్రు. నాలుగో విడత మాఫీ జాబితాలోనూ నా పేరు రాలేదు. అధికారులను కలిస్తే ఏం చెప్తలేరు. ఎవరిని అడగాలో తెల్తలేదు.
– మంద విజయలక్ష్మి, ఎడ్లపల్లి, మల్హర్, భూపాలపల్లి
కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది..
తిరుమలాయపాలెం ఏపీజీవీబీలో రూ.3.05 లక్షల అప్పు ఉంది. రూ.2 లక్షల రుణమాఫీ కోసం పైన ఉన్న రూ.1.05 లక్షల అప్పు కట్టేశాను. ఇప్పుడు నాకు అప్పు రూ.2 లక్షల లోపు ఉన్నా మాఫీ రాలేదు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది.
– బానోతు లక్పతి, రైతు,బాలాజీనగర్‌తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా
కాలం వెళ్లదీస్తున్నరు
జనగామ రూరల్: జనగామ మండలం పెంబర్తి యూనియన్ బ్యాంక్‌లో రూ. 2.40 లక్షల పంట రుణం తీసుకున్న. ప్రభుత్వం రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని, వాటి కంటే ఎక్కువ ఉంటే కట్టాలనడంతో రూ.45వేలు బ్యాంకులో కట్టిన. నా పంట రుణం ఇంకా రూ.1.95 లక్షలు ఉన్నది. బ్యాంకులో అడిగితే కొత్తలిస్టు రాలేదని, వస్తే చెప్తామంటూ కాలం వెల్లదీస్తున్నరు. మొన్న రైతు పండుగ నాడు సీఎం ప్రకటించినా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు.
– సంపత్, రైతు, పెంబర్తి, జనగామ