నడిరోడ్డుపై అన్నదాతల బైఠాయింపు
అల్లాదుర్గం : ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై వాహనాలు, ధాన్యం మ్యాచర్ పరికరాన్ని అడ్డంగా పెట్టి బైఠాయించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో జాప్యం చేస్తుండటంతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. పదిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతుల ఇబ్బందులను అధికారులకు విన్నవించడంతో ఆందోళన విరమించారు.
తరుగుపై రైతన్న ఆందోళన
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో బస్తాలు తడిసి ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువెళ్తే కటింగ్ పేరుతో 4 కిలోల నుంచి 10 కిలోల వరకు కోత పెడుతున్నారంటూ రైతులు గురువారం పెద్దముప్పారంలో రోడ్డుపై బైఠాయించారు. తరుగు లేకుండా కాంటా పెట్టకపోతే చావే శరణ్యమని వారు హెచ్చరించారు.
– దంతాలపల్లి
మహబూబాబాద్ జిల్లాలో రైస్‌మిల్లు ఎదుట నిరసన
ధాన్యం తూకంలో కోత విధించొద్దంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఓం సాయిరాం రైస్ మిల్లు ఎదుట గురువారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దవంగర మండలం పోచంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఈ నెల 24న లారీలో ఆరుగురు రైతులకు చెందిన 932 బస్తాల ధాన్యం కేసముద్రం మండల కేంద్రంలోని ఓం సాయి రైస్ మిల్లుకు దిగుమతి చేసినట్టు తెలిపారు. అయితే మిల్లరు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కో బస్తాకు 2 కిలోల చొప్పున క్వింటాల్‌కు 5 కిలోలు కోత విధిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు మిల్లు వద్దకు చేరుకొని తూకంలో కోత విధించవద్దని వ్యాపారులకు సూచించడంతో రైతులు ఆందోళన విరమించారు.
– కేసముద్రం
కలెక్టర్ సారూ జర పట్టించుకోండి..
పక్షం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఓ రైతు గురువారం ఏకంగా వడ్ల బస్తాతో నిర్మల్ కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్‌కు చెందిన రైతు బొట్టు శ్రీనివాస్ పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. తేమ శాతం వచ్చినా లారీలు, హమాలీలు రాలేదని నిర్వాహకులు కొనుగోలు చేయలేదు. వర్షాలకు ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఎక్కువ తూకం వేయాలని నిర్వాహకులు తెలపడంతో రైతు ఆందోళన చెంది వడ్ల బస్తాను నిర్మల్ కలెక్టర్‌కు తీసుకొచ్చి నిరసన తెలిపాడు.
-నిర్మల్ చైన్‌గేట్
కాళ్లు మొక్కినందుకు కదిలిండ్రు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను చకాచకా తరలిస్తున్నారు. వడ్లు కాంటా పెట్టాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు బుధవారం నర్సింహులపేట తహసీల్దార్ రమేశ్‌బాబు కాళ్లు మొక్కి వేడుకోవడంతో గురువారం అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రంలో కాంటాలు పెట్టిన ఆరు వేల బస్తాల్లో 4 వేల బస్తాలను నాలుగు లారీలు, ఒక డీసీఎం వాహనంలో మిల్లుకు తరలించారు. అదేవిధంగా వెయ్యి బస్తాలు కాంటా పెట్టినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన సుమారు 3 వేల బస్తాలు కాంటాలు పెట్టాల్సి ఉన్నదని, కాంటా పెట్టిన 2 వేల బస్తాలను శనివారం వరకు పూర్తిస్థాయిలో మిల్లులకు తరలిస్తామని పేర్కొన్నారు.
-నర్సింహులపేట