ఊట్కూర్, అక్టోబర్ 29 : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల పరిధిలోని విజయ కాటన్ ఇండస్ట్రీలో బుధవారం పత్తి కొనుగోళ్లను(Cotton) అధికారులు నిలిపివేశారు. సీసీఐ చేపట్టిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు మూసివేయడంతో ఆగ్రహించిన పత్తి రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పత్తి రైతుల నిరసనతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.
సీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం
రైతుల ధర్నాతో నారాయణపేట మక్తల్ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు బారులు తీరి నిలవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాల కారణంతో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ముందస్తు టైం స్లాట్ నమోదు చేసుకున్నామని, తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఈరోజు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తే వాహనాలు, కూలీల ఖర్చును ఎవరు భరించాలని రైతులు సీసీఐ అధికారులను నిలదీశారు.
తక్షణమే కొనుగోలు చేయాలి
ప్రకృతి ప్రకోపంతో పత్తి పంటలు దిగుబడి తగ్గి తీవ్ర నష్టాల్లో ఉన్నామని.. పండిన కొద్దిపాటి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం, అధికారులు నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే దిగివచ్చి పత్తి కొనుగోలను ప్రారంభించాలని రైతులు భీష్మించారు. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రామ్ లాల్, ఊట్కూర్ ఎస్సై రమేష్ బలగాలతో ఇండస్ట్రీ వద్దకు చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఊట్కూరు తహసీల్దార్ చింత రవి, నారాయణపేట మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి రైతుల ధర్నా వద్దకు చేరుకొని సీసీఐ అధికారులతో చర్చలు జరిపారు.
దిగివచ్చిన అధికారులు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోళ్లను ప్రారంభించేందుకు అధికారులు ఇచ్చిన హామీతో రైతులు శాంతించి ఆందోళనను విరమించారు. కాగా, పత్తికి 8 నుండి 12% తేమ నిబంధనను విధించి సీసీఐ కొనుగోళ్లను చేపట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా 12 శాతం కంటే ఎక్కువ తేమ కలిగిన పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని, ఈ నిబంధనతో పత్తి అమ్మకాలు జరగడం లేదంటూ రైతులు తమ ఆవేదనను తాసిల్దార్ ముందు వినిపించారు. పత్తికి తేమ శాతం నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు మద్దతుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం.భరత్, బీజేపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.