పాలకుర్తి, మే 1 : ‘నెల రోజులైంది. కాంటా అయితలేవు.. బస్తాలు మావే. హమాలీ ఖర్చు మాదే. లారీలు, డీసీఎం కిరాయి మాదే. ఇదెక్కడి పాపం దయన్న.. జర మా బాధలు చూడవే.. నిన్ను, రైతు బాంధవుడు కేసీఆర్ను ఓడగొట్టుకుని బాధపడుతున్నం’ అని పలువురు రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముందు గోడువెళ్లబోసుకున్నారు. ఎర్రబెల్లి శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తికి వచ్చి వెళ్తూ స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఆగారు. రైతులు ఆయన వద్దకు వచ్చి తమ బాధలను చెప్పారు. ‘ఇదెక్కడి పాపం దయన్న.. మార్కెట్లో మక్కలుపోసి నెల రోజులైంది. అధికారులు ఉండరు.. బస్తాలు ఉండవు.. లారీలు రావు.. పట్టించుకునే నాథుడే లేడు’ అని పలువురు భోరున విలపించారు.
దీనిపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో, పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా పంట అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నెల రోజులైనా కాంటా పెట్టరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు, ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని రేవంత్రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు మోసపోయారని అన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, బోనస్ విషయాల్లో కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ నెల 5లోగా మార్కెట్లోని మక్కలను కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 6న వరంగల్లో జరిగే రైతు సభకు రైతులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.