ఆత్మకూర్ ఎస్, ఫిబ్రవరి 20 : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై పెన్పహాడ్ మండలానికి చెందిన రైతులు గురువారం సాగునీటి కోసం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారబందీ పద్ధతిలో ఈ నెల 16న గోదావరి జలాలు విడుదల చేసిన అధికారులు ప్రధాన కాల్వకు నీటిని అందించకపోవడంతో పెన్పహాడ్ మండలంలో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
కోటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ డీబీఎం 71 ద్వారా పెన్పహాడ్ మండలానికి నీరు రావాల్సి ఉండగా, ప్రధాన కాల్వకు నీళ్లు అందించకుండా 36ఎల్ కాల్వ ద్వారా మోతె మండలానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ డీఈ రమేశ్ చేరుకుని నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రధాన కాల్వ గేట్లను ఎత్తడంతో మెయిన్ కెనాల్ నుంచి నీటి సరఫరా ప్రారంభమైంది.