నంగునూరు, మార్చి 11: సాగు నీరు విడుదల చేసి పంట పొలాలను రక్షించాలని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హనుమకొండ -సిద్దిపేట రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్ రైతులకు ఆందోళనకు మద్దతు తెలిపారు. రెండు రోజుల్లో సాగునీరు అందకుంటే పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి పెద్దవాగులోకి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజగోపాల్‌పేట ఎస్ఐ భాస్కర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ చంద్రశేఖర్ దృష్టికి ఎస్ఐ తీసుకెళ్లారు. డీఈఈ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని సాగునీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
రైతుల వంటావార్పు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో పరకాల-హనుమకొండ రహదారిపై శ్రీరాంలపల్లి, గూనిపర్తి, అంబాల గ్రామాల రైతులు సోమవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ అధికారులు డీబీఎం 24కు సరిపడా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయని పేర్కొన్నారు. కాకతీయ కాలువ గేటు కూడా పూర్తిస్థాయిలో లేపకపోవడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందడంలేదని అన్నారు. వరి పొట్టదశలో, మక్కజొన్న పీసు వేస్తుండడంతో అధికారులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువ నీళ్లు రాకపోతే 500 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపూర్, హసన్‌పర్తి పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు చెప్పడంతో అక్కడికి వచ్చిన ఎస్సారెస్పీ ఏఈ రాకేశ్ నీళ్లు వదలటం తన పరిధిలో లేదని చేతులెత్తేశాడు. సీఐ హరికృష్ణ ఎస్సారెస్పీ ఎస్ఈ వద్దకు తీసుకెళ్తానని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.