హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ అధికారులకు రుణమాఫీ సెగ తగిలింది. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీపై అధికారులను రైతులు నిలదీశారు. రుణమాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని, అర్హత ఉన్నా తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల రైతులు రుణమాఫీ సమస్యలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్ జిల్లాల నుంచి భారీగా ఫిర్యాదులు అందడం గమనార్హం.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి రైతులకు సర్దిచెప్పారు. రైతులు లేవనెత్తిన పలు ఫిర్యాదులపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ నిర్ధారణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణం రూ.2 లక్షలకుపైగా ఉన్నవారికి సంబంధించి పై రుణం బ్యాంకుల్లో చెల్లించేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణకు నోడల్ అధికారులను నియమించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదులు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.