సిద్ధిపేట: మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌కు అనుగుణంగా రైతులు మారాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చిన్నకోడూరు మండలంలోని శనివారం రైతు వేదికను ప్రారంభించి, అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మాచాపూర్, చౌడారం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు పొద్దుతిరుగుడు విత్తనాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలను గడించవచ్చన్నారు.
రైతు ఉత్పిత్తిదారుల సంస్థ- ఎఫ్‌పీఓ కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ఎఫ్‌పీఓ ఉద్దేశమన్నారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూరు మండలంలో వెయ్యి ఎకరాలకు పొద్దుతిరుగుడు విత్తనాన్ని మారుస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు నేరుగా మద్దతు ధర రావడంతో పాటు వచ్చిన ఉత్పత్తి ఆదాయాన్ని తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉన్నదన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు తేనేటీగల ఉత్పత్తి ద్వారా కలిగే లాభాలపై 700 మంది రైతులకు విడతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ ఇవ్వానలి సంస్థ శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. యాసంగిలో సన్ ఫ్లవర్ పంటకు మంచి దిగుబడి వస్తుందని, ఈ విషయంపై శాస్త్రవేత్తలు రైతులను చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా మంత్రి తెలిపారు. రాష్ట్రం మరింత సమృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నూనె గింజల ఉత్పత్తిలో భారత్ రూ.90వేలకోట్ల విదేశీ మాదక ద్రవ్యం కోల్పోతున్నట్లు, పామాయిల్ సాగు లాభసాటిగా ఉన్నదని, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.
ఏటా దేశంలో రూ.90వేల కోట్ల విలువైన పామాయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. దీని నియంత్రణకు దేశంలో 70లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలని.. ఈ సమయంలో ఆయిల్ సీడ్ మనకు ఓ వరంలాంటిదన్నారు. వచ్చే ఏడాది 50వేల ఎకరాల ఆయిల్ పామ్ నర్సరీకి చిన్నకోడూరు, సిద్ధిపేట సిద్ధమైందని మంత్రి చెప్పారు. నూనె ఉత్పత్తులు, పప్పు దినుసుల పంటలు పండించాలని రైతులను కోరుతూ.. చిన్నకోడూర్ మండలంలో ఎఫ్‌పీఓ వెయ్యి ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఓ వరమన్నారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని లేఖ రాసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలు విషయమై చర్చించి వచ్చారని.. అయినా మార్పు రాలేదని పేర్కొన్నారు. ఎఫ్ఐసీ నాలుగేండ్లకు సరిపడే ధాన్యం నిండిందని.. ఈ యాసంగికి వడ్లు కొనమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని.. ఎఫ్‌సీఐ ఉంపుడు బియ్యం కొనే పరిస్థితి లేదని.. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందన్న ఆయన.. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి సిద్ధిపేట జిల్లాల్లో ధాన్యం రికార్డు స్థాయిలో 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని.. గతంలో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం పండేదని తెలిపారు.
తెలంగాణలో పండిన పంట మొత్తం కొనడానికి కొనుగోలు సిద్ధంగా ఉన్నాయని.. కానీ పండిన పంట ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు సమస్యగా మారిందన్నారు. ఓ వైపు స్థలం లేమి, మరో వైపు హమాలీలు దొరక్కపోతే బిహార్‌కు రప్పిస్తున్నామన్నారు. చిన్నకోడూరు మండలంలో రైతుబంధు కింద రూ.20 కోట్లు, రైతుబీమా కింద 140 మంది రైతులకు రూ.7కోట్ల ప్రభుత్వం వెచ్చించినట్లు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాముని శ్రీనివాస్, సర్పంచ్ ఉమేశ్, ఆర్డీఓ అనంత రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.