హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు. కొన్ని పంటలకు రవాణా ఖర్చులు కూడా మిగలని దుస్థితి నెలకొన్నది. దీంతో రైతులు ఉద్యాన పంటల సాగుకు దూరమవుతున్నారు. పంటలను మారెట్లో నేరుగా అమ్ముకునే వెసులుబాటు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రైతులు, రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా దళారుల వల్లే కూరగాయల రైతులు విలవిలలాడుతున్నారని ఇటీవల కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సర్వేలోనూ గుర్తించింది. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు కావడంలేదు. అంటే మార్కెట్లో కూరగాయల కొరత ఉన్నది. కొరత ఉన్నప్పుడు ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆ లాభం రైతులకు అందడంలేదు. దళారుల చేతుల్లోకి వెళ్తున్నది. రైతులు పంటను నేరుగా మార్కెట్లో విక్రయించే అవకాశం కల్పించే అవకాశాలను ప్రభుత్వం పెంచాలని శాస్త్రవేత్తలు నివేదికలో సూచించారు.
బీఆర్ఎస్ హయాంలోనే రైతు మార్కెట్లు
ఉద్యాన రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో నగరాలు, పట్టణాల్లో 36 రైతు మార్కెట్లను నెలకొల్పారు. వీటిని వినియోగదారులకు, రైతులకు అనుసంధానం చేశారు. రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యాన పంటలను సాగు చేశారు. రైతులే నేరుగా పంటను మార్కెట్లకు తరలించి విక్రయాలు జరిపారు. కరోనా సమయంలోనే రైతు మార్కెట్ల నుంచి నేరుగా రైతులే ప్రజల వద్దకు కూరగాయలు సరఫరా చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచడంలో, మండల స్థాయికి విస్తరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పండించిన పంటలను దూరప్రాంతాలకు తరలించేందుకు అయ్యే రవాణ ఖర్చులను భరించలేక.. స్థానికంగా దళారులకు అరకొర ధరకు విక్రయిస్తున్నారు. మండల స్థాయిలోనూ రైతు కేంద్రాలను ఏర్పాటు చేస్తే సమస్యను పరిష్కరించవచ్చని ఉద్యాన వర్సిటీ నిపుణులు నివేదికలో సూచించారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు తీరు ఇలా
పంట సాగు విస్తీర్ణం