హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కూరగాయల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న కూరగాయల కొరతను తీర్చడం కోసం ఈ ఏడాది సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం, ఉద్యాన వర్సిటీ, ఉద్యానశాఖలు ప్రకటించాయి. కానీ వీటిమధ్య సమన్వయం లోపించింది. తెలంగాణలో కూరగాయల సాగును ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా నాణ్యమైన విత్తనాలు, నార్లు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం విత్తనోత్పత్తిపై ఉద్యాన వర్సిటీ దృష్టి పెట్టాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ రూపొందించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యాన శాఖ సబ్సిడీలు అందిస్తున్నామని చెబుతున్నా రైతులకు విత్తనాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడంలేదు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై జరుగుతున్న చర్చ కేవలం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో టమాటా, మిర్చి, బెండ, బీర, కాకర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వంగ, టమాటా, మిర్చి తదితర నార్లను ప్రభుత్వ ఉద్యానవన కేంద్రాలు అతి తకువ ధరలకే అందిస్తున్నట్టు చెబుతున్నా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సరిపడా నార్లు దొరుకక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అధిక ధరకు కొనలేక మార్కెట్లో నాణ్యతలేని విత్తనాలను కొని సాగు చేస్తున్నారు. దీంతో రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోతున్నారు. విత్తన మేళాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని జిల్లాల్లో విత్తనాలు సకాలంలో అందక రైతులు నిరాశ చెందుతున్నారు.
రాష్ట్రంలో కొరతను అధిగమించడానికి రైతులు కూరగాయల సాగును చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నా ప్రభుత్వం నుంచి లభిస్తున్న సౌకర్యాల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన పెట్టుబడిలో 40 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది. భవిష్యత్తులో కూరగాయల సాగును భారీగా పెంచేలా ఉచిత విత్తన పంపిణీని ఉద్యానశాఖ అధికారులు చేపడుతున్నట్టు చెబుతున్నా అవి క్షేత్రస్థాయిలో రైతులకు చేరడం లేదు.
టమాటా, మిర్చి, వంగ, కాకర, బెండ, చిక్కుడు, క్యాబేజీ, బీర తదితర పంటల్లో హైబ్రిడ్ రకాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ వీటి ఉత్పత్తి స్థానికంగా లేదు. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారికి ఈ హైబ్రిడ్ రకాలను కొనుగోలు చేయడం కష్టం కాదు. కానీ తక్కువ విస్తీర్ణంలో సాగుచేసే రైతులకు ఈ విత్తనాలను కొనుగోలు చేయడం భారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెండ, కాకర, టమాటా, మిర్చి విత్తనాలు కేజీ ప్యాకెట్లుగా ఉండటం, వాటి ధరలు వేలల్లో ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు కూరగాయల సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.