కందుకూరు, ఆగస్టు 1: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో కాకుండా పట్టా భూముల జోలికివస్తే ఊరుకోబోమని రైతులు స్పష్టం చేశారు. ముచ్చర్ల, దెబ్బడగూడ రెవెన్యూల పరిధిలోని భూముల్లో సర్వే ఫెన్సింగ్ వేయడానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 123లో 580 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించారు. ఈ భూముల్లో ఫెన్సింగ్ వేయకుండా దెబ్బడగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని 31 వ సర్వే నంబర్లో పట్టా భూముల గుండా ఫెన్సింగ్ వేయడానికి తహసీల్దార్ గోపాల్, ఆర్ఐ శ్రీకాంత్, మహేశ్వరం డివిజన్ ఏసీపీ జానకిరెడ్డితో సహా పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో పట్టా భూముల్లో ఫెన్సింగ్ ఎలా వేస్తారంటూ రైతులు జిట్టె రాజేందర్‌రెడ్డి, రాములునాయక్, జైపాల్‌నాయక్, గోపీనాయక్, శంకర్‌నాయక్, క్రిష్ణయ్య బీరప్ప, మల్లేశ్‌తో పాటు పలువురు అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని గిరిజన రైతు రాములు నాయక్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పట్టాభూములను తీసుకోవాలని చూడటం సబబు కాదని సూచించారు. వారికి హద్దులు చూపించిన తర్వాతే ఫెన్సింగ్ వేయాలని కోరారు. రైతుల జోలికి వస్తే ఊరుకోబోమని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. దీంతో ఫెన్సింగ్ పనులను అధికారులు నిలిపివేశారు.