హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా అధికార బలం ఉన్నవారికే యూరియా అందుతున్నది. యూరియా కోసం రైతులు రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అనారోగ్యంతో క్యూలో నిలిచి ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్రం ఇవ్వడం లేదని, స్టాకు లేదని సాకులు చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వాధినేతలు.. వచ్చిన యూరియాను అస్మదీయుల కోసం దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తున్నది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) గన్‌మెన్ లారీ యూరియా లోడును దారి మళ్లించిన ఘటనలో తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి రెండు లారీల యూరియా కాదు.. ఏకంగా 30 నుంచి 40 లారీల వరకు యూరియా పక్కదారి పట్టినట్టు తెలుస్తున్నది.
రాత్రికి రాత్రే వాటిని తమ ప్రాంతాలకు తరలించి ఎక్కడికక్కడ లోడును దింపేసుకున్నట్టు సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతో జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలతో ఈ తతంగమంతా నడిచినట్టు స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా తన కుమారుడి నియోజకవర్గం నాగార్జునసాగర్‌కు పదుల సంఖ్యలో యూరియా లారీలు మళ్లించుకున్నట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అవసరమైన యూరియా రైల్వే వ్యాగన్ల ద్వారా మిర్యాలగూడ కేంద్రంగా దిగుమతి అవుతుంది. ఈ యూరియాను ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)లకు, డీడీలు చెల్లించిన డీలర్లకు చేరవేయాల్సి ఉంటుంది.
వారు రైతులకు అందిస్తారు. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన యూరియాను లారీల్లో లోడుచేసిన తర్వాత జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతో, జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలతో వ్యవసాయాధికారులు ఏకంగా 30-40 యూరియా లారీలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్పిన ప్రాంతాలకు మళ్లించినట్టు తెలిసింది. కొన్ని వీడియోలు గ్రూపుల్లో వైరల్‌గా మారాయి. యూరియా బస్తాల లోడుతో రాత్రి వేళ వెళ్తున్న ట్రాక్టర్ల వీడియోలు సైతం వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. లారీలకు ముందువెనుక బైక్‌లపై కొందరు అనుసరిస్తున్నట్టు వీడియో స్పష్టంగా కనిపిస్తున్నది.
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తమ నియోజకవర్గ రైతులు కూడా యూరియాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తమకు కొన్ని లారీల లోడు కావాలని మళ్లించుకున్న ట్టు తెలిసింది. పదుల సంఖ్యలో యూరియా లారీలు సాగర్ నియోజకవర్గానికి వెళ్లినట్టు అక్కడి విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, లారీ యూరియా లోడు దారి మళ్లించిన ఘటనలో బీఎల్ఆర్ గన్‌మెన్‌పై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అతన్ని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు సమాచారం.