హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా దరిపల్లిలోని సర్వే నంబర్-294 వివాదాస్పద భూములపై రైతులు కోర్టును ఆశ్రయించారు. వారసత్వంగా వస్తున్న సదరు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి.. తమ భూములు తమకు అప్పగించాలని కోరారు. ఈ మేరకు హైకోర్టు రైతుల పిటిషన్ను విచారణకు స్వీకరించింది. లావుణి పట్టాలున్న తమ భూములను డెవలప్మెంట్ పేరుతో కొందరు నాయకులు సేకరించి అక్రమంగా పట్టాలు చేయించుకుని తమ ను భూముల్లోకి వెళ్లనీయడం లేదని రైతు లచ్చపేట ముత్తగౌడ్తోపాటు మరో 19 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు డబ్ల్యూపీ 16161 నంబర్ ఇచ్చి రైతుల వద్ద ఉన్న పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఇదీ నేపథ్యం..
దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్-భూంపల్లి మండలంలోని దరిపల్లిలో సర్వే నంబర్-294లో 178.05 ఎకరాల భూమి ఉన్నది. సేత్వార్, కాస్రా పహాణి రెవెన్యూ రికార్డుల్లో ఈ మొత్తం ప్రభుత్వ భూమిగా ఉన్నది. ఇందులో 294/1 నుంచి 294/3 వరకు ఉన్న 51 ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉండగా, 294/4 నుంచి 294/10 సర్వే నంబర్లలో ఉన్న భూమి మాత్రం ప్రైవేటు పట్టాకు ఎకినట్టు రికార్డులు చూపుతున్నాయి. ఆ భూమిలో అదే గ్రామానికి చెందిన కుమ్మరి, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతులు చాలాకాలంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూములు తమకు వారసత్వంగా అసైన్డ్ పట్టా భూములుగానే వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. అసైన్డ్ భూమి అంటే అమ్మకానికి వీలు ఉండదు. అలా కాకుండా విక్రయిస్తే పీవోటీ యాక్ట్ ప్రకారం స్వా ధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. ఈ భూముల్లోని 74 ఎకరాల వరకు కొంత మంది ప్రముఖ వ్యక్తులు లీజు పేరుతో స్వాధీనం చేసుకుని పట్టా మార్పిడి చేసుకున్నారని రైతులు ఆరోపించారు.