Kodangal | కొడంగల్, ఫిబ్రవరి 8: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం పోలీసుల పహారాలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో రెవెన్యూ అధికారులు పట్టా భూముల సర్వే చేపట్టారు. ఇప్పటికే పోలీసుల దౌర్జన్యం, కేసులతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల రైతులు పోలీసు వలయంలో సర్వే చేస్తుండటంతో భయంతో పొలాలకు కూడా వెళ్లలేదు. దీంతో రైతులు లేకుండానే పోలీసులు సమక్షంలో అధికారులు సర్వే చేశారు.
భయంతో అటు దిక్కు చూడని రైతులు
కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి భూ సేకసరణ పనులను అధికారులు వేగవంతం చేశారు. శుక్రవారం వరకు పోలేపల్లి, లగచర్ల, హకీంపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూముల సర్వే చేపట్టగా.. శనివారం హకీంపేట పరిధిలో 146 ఎకరాల పట్టా భూముల్లో సర్వే నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా పోలీసులు మోహరించడంతో రైతులు అటుదిక్కు చూడలేదు. రైతులు లేకనప్పటికీ దుద్యాల తహసీల్దార్ కిషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. హకీంపేట గ్రామ పరిధిలో మొత్తం 114 మంది రైతులకు సంబంధించి 146 ఎకరాల పట్టా భూముల సేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 20 మంది రైతులు 40 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సమ్మతి తెలిపినట్టు తహసీల్దార్ వివరించారు. పట్టా భూములకు ఎంత నష్టపరిహారం చెల్లించాలనే విషయంపై స్పష్టత రాలేదని తెలిపారు. సమ్మతి తెలిపిన రైతుల భూములతో పాటు మిగతా భూముల్లోనూ సర్వే చేపట్టి హద్దులు గుర్తిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారనేది నిర్ణయించకుండానే సర్వే చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రైతుల సమ్మతి లేకుండానే
తమ సమ్మతి లేకుండానే సర్వే చేపడుతుండటంపై రైతులు మండిపడుతున్నారు. కష్టపడి సంపాదించిన భూములను ప్రభుత్వానికి ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనుకాడబోమని చెబుతున్నారు. ప్రభుత్వ భూము లు ఇస్తే ఇబ్బంది ఉండదని, కానీ లక్షల విలువైన భూములను ఇవ్వాలంటే ప్రాణాలు పోయినంత పని అవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మా భూములు విడిచిపెట్టండి సారూ
కాళ్లు మొక్కుతాం సారూ.. మా భూములు మాకు విడిచిపెట్టండి. ఉన్న దోశడంత భూమిలో మేము, మా ముగ్గురు పిల్లలం బతకాలి. ఈ మట్టిలోనే పుట్టాం.. ఈ మట్టిలోనే కలిసిపోతాం. వ్యవసాయం తప్ప మాకు ఇంకేం తెల్వదు. మా బతుకుల గురించి ఒక్కసారి ఆలోచించండి సీఎం సారూ.
-మంగళి జయమ్మ, మహిళా రైతు,హకీంపేట దుద్యాల మండలం
పుస్తెలమ్మి భూమి కొన్న
ఎన్నో కష్టాలకోర్చి, పుస్తెలమ్మి 7 ఎకరాలు కొన్నాం. నా కొడుకులు కాయకష్టం చేసి పంటలు సాగు చేస్తున్నారు. మా భూములన్నీ పోయేలా ప్రభుత్వం సర్వే చేస్తున్నది. భూమి లేకుండా మేం బతకలేం. ఎన్ని కష్టాలు ఎదురైనా భూమి ఇవ్వం.
-అనంతమ్మ, మహిళా రైతు,హకీంపేట, దుద్యాల మండలం