జయశంకర్ భూపాలపల్లి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కొమిరెడ్డి చిన్నరాజిరెడ్డిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామం. ఆయన పేరుపై ఆరు ఎకరాలు, భార్య పేరుమీద 2 ఎకరాలు, కొడుకు పేరుపై 2 ఎకరాల 27 గుంటల భూమి ఉన్నది. కుటుంబమంతా కాయకష్టం చేస్తారు. మొత్తం 10 ఎకరాల్లో వరి, పత్తి, మిరప సాగుచేస్తున్నారు. ఈ ముగ్గురి పేరిట వానకాలానికి రూ.50 వేలు, యాసంగికి రూ.50 వేలు రైతుబంధు పైసలు పడ్డయి. ఆయన భార్య దేవక్కకు ప్రతినెలా పింఛన్ వస్తున్నది. గతంలో ఎవుసం చేయాలంటే చాలా బాధలు పడేవారు. పెట్టుబడికి పైసలు లేక, కరెంటు సరిగా రాక అరిగోసపడ్డారు.
వరంగల్ పోయి అడ్తిదారు దగ్గర అప్పు తెచ్చేవారు. అక్కడ దొరకకపోతే షావుకారు వద్ద పొలం కాగితాలు పెట్టి తీసుకొచ్చేవారు. పంట పండినాక వచ్చిన పైసలతో అసలు, మిత్తి కట్టి ఉన్నదాంట్లో సర్దుకొనే వారు. ఐదేండ్లుగా రైతుబంధు పైసలు వస్తుండటంతో రాజిరెడ్డి బాధలు పూర్తిగా పోయాయి. సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి పైసలు పడుతుండటంతో ఇప్పుడు అప్పు చేయకుండా దర్జాగా వ్యవసాయం చేస్తున్నారు. ‘తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు ఏటా రెండుమార్లు రైతుబంధు పైసలు టైంకు వేత్తుండు. ఇప్పుడు అడ్తిదారు, మిత్తీలకు ఇచ్చేటోళ్ల దగ్గరికి పోయే బాధ తప్పింది. టైంకు రైతుబంధు పైసలు వత్తుండడంతో విత్తనాలు, మందు బస్తాలు కొంటున్న. కూలి పైసలు ఇయ్యడానికి సరిపోతున్నాయి.
కేసీఆర్ సారు వల్ల పెట్టుబడి ఎట్ల అనే రంది లేకుండా పోయింది. చెరువు, కుంటలను సర్కారు మంచిగ చేసింది. బోర్ ఏపిత్తే పైన్నే నీళ్లు పడుతున్నాయి. ఐదేండ్ల కింద రెండు బోర్లు ఏసిన. పుష్కలంగా నీళ్లు పడ్డయి. కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇత్తుండు. ఏ టైం అంటే ఆ టైంకు పోయి మోటరేసి చేనుకు నీళ్లు పారిత్తాన. పంట ఏత్తే పెట్టుబడి, కరెంటు అందక ఎండిపోతదనే రంది లేదు. మంచిగా పంటలు పండిత్తున్న. అంతకు ముందున్న అప్పులన్ని తీర్చిన. ఇంకొంత భూమి కొన్న. వడ్లు కూడా సర్కారే కొంటుంది. నేను మాత్రం తెలంగాణ వచ్చినంకనే బాగుపడ్డ. రైతులకు ఇంత బాగా చేత్తున్న కేసీఆర్ సారే మళ్లీ రావాలి’ అని కొమిరెడ్డి చిన్నరాజిరెడ్డి, దేవక్క దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను మించినోడు లేడు

నాకు 78 ఏండ్లు. 60 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇన్నేండ్లలో ఎంతోమంది ముఖ్యమంత్రులొచ్చి పోయినరు. సీఎం కేసీఆర్ సార్‌ను మించినోడు లేడు. రైతుబంధు డబ్బులు ఇయ్యడంతో సంతోషంగా నాగళ్లు పట్టి పొలాల్లోకి పోతున్నాం. గతంలో నానా అవస్థలు పడేటోల్లం. అప్పుల పాలయ్యేవాళ్లం. ఇయ్యాల పొలాల నిండా నీళ్లు, ఫుల్‌గా కరెంటు వస్తున్నది. ఎరువులు, విత్తనాలకు తిప్పలు లేవు. ఏడాదిలో రెండుసార్లు పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం అందిస్తుండు. కేసీఆర్ ఎప్పుడో ముఖ్యమంత్రి అయితే రైతుల బతుకులు అప్పుడే బాగుపడేవి. ఇసొంటి ముఖ్యమంత్రిని ఎన్నాళ్లయినా కాపాడుకుంటాం.
-బానోతు సుందర్, మున్యానాయక్‌తండా, సూర్యాపేట జిల్లా
వ్యవసాయం చేస్తున్నమంటే కేసీఆర్ దయే

తెలంగాణ రాకముందు వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పండిన పంటలు వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చేవాళ్లం. వ్యవసాయంలో నష్టాలే తప్ప బాగుపడ్డది లేదు. ఇప్పుడు రైతులకు మంచి రోజులొచ్చాయి. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి వ్యవసాయం పండుగలా మారింది. నాకు ఉన్న ఎకరంన్నర భూమిలో వరి, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకుంటున్నాం. మంచిగా బతుకుతున్నాం. రైతుబంధుతోపాటు 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తుండటంతో వ్యవసాయంలో లాభాలు వస్తున్నాయి. అప్పట్లో కరెంట్‌లేక పంటలు పండక కూలి పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నమంటే కేసీఆర్ దయే. కేసీఆర్ సారు రైతు కష్టం గుర్తించిండు. ఆయన చేసిన మేలు రైతులు మరచిపోరు.
– మహేశ్, రైతు, గోసాయిగూడ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
కేసీఆర్ సారు దేవుడు
మా పేర్లు సత్తవ్వ, నాగమణి. మెదక్ మండలం కొంటూరు మా స్వగ్రామం. మా ఇద్దరి పేరుమీద 5 ఎకరాలు ఉన్నది. 50-60 ఏండ్ల నుంచి మా అయ్యలు వ్యవసాయం చేస్తుండ్రు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ఒక్క పైస ఇవ్వలేదు. అప్పులు తెచ్చి పంటకు పెట్టిండ్రు. పంట వచ్చిన తర్వాత అప్పులు తీర్చగా వచ్చే పైసలతో కుటుంబాన్ని సాధిండ్రు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు రెండు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తుండ్రు. 5 ఎకరాలకు రెండు సీజన్లకు రూ.50 వేలు బ్యాంకుల పడ్డయి. ఇప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి లేదు. ఎరువులు, కూలీలు, ట్రాక్టర్ల కిరాయిలకు రైతుబంధు పైసలు అక్కరకొస్తున్నయి. పెట్టుబడి సాయం అందిస్తున్న కేసీఆర్ సారు చల్లగా ఉండాలి.
-సత్తవ్వ, నాగమణి, కొంటూరు, మెదక్ జిల్లా
రంది లేకుండా ఎవుసం

మాకు ఊరిలో నాలుగు ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు కింద వానకాలం రూ.20 వేలు, యాసంగిలో రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో పడ్డయి. గీ పథకం వచ్చినప్పటి నుంచి రంది లేకుండా ఎవుసం చేసుకుంటున్నం. ఇదివరకు పెట్టుబడి కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. పంట పండినంక ఉన్నదంతా ఊడిచి మిత్తిలతో కట్టేటోళ్లం. ఇప్పుడా బాధ లేదు. సీఎం కేసీఆర్ రైతులను అన్నితీర్ల ఆదుకుంటున్నడు. జీవితాంతం గాయనకు రుణపడి ఉంటం. మొన్ననే నారు పోసిన. ఇగో ఇయ్యాల అలుకుతున్న.
-కామ రాజన్న, కోటపల్లి, మంచిర్యాల జిల్లా
వలస పోయినోళ్లు తిరిగొచ్చారు

నాకు రెండెకరాల భూమి ఉన్నది. అందులో వరి సాగు చేస్తున్నా. గతంలో సాగు చేసేందుకు నానా తంటాలు పడ్డాను. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధుతో ఎంతో భరోసా కలిగింది. సంబురంగా పంటలు పండించుకుంటున్నా. గతంలో నీరు లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మంత్రి నిరంజన్‌రెడ్డి సహృదయంతో సాగునీరు తీసుకొచ్చారు. దీంతో వలసవెళ్లిన వారంతా స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఇంతటి మార్పు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి రైతులు రుణపడి ఉంటారు.
-నరేందర్‌రెడ్డి, యువరైతు, అంకూర్ గ్రామం, వనపర్తి జిల్లా
గౌరవం పెరిగింది

నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాక ముందు విత్తనాలు, ఎరువుల కోసం మస్తు తిప్పలయ్యేటిది. ఉద్దెర కోసం దుకాణాల చుట్టూ తిరిగి తిరిగి పరేషాన్ అయ్యేటోళ్లం. పదిసార్లు పోతేగానీ దయచూపే టోళ్లు కాదు. నకిలీ విత్తనాలు అంటగట్టేవారు. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత మా బాధలన్నీ పోయినయ్. రైతుబంధు పైసలతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సీజన్ ప్రారంభానికి ముందే కొనుక్కుంటున్నం. గతంలో పదిసార్లు తిరిగితే కానీ విత్తనాలు, ఎరువుల బస్తాలు ఇయ్యని దుకాణాదారులు రైతుబంధు పైసలు ఎట్లయినా వస్తయన్న నమ్మకంతో ఇప్పుడు మాకే ఫోన్ చేస్తున్నరు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల కారణంగా రైతులకు గౌరవం పెరిగింది.
– రాజేశ్వర్‌రెడ్డి, రైతు, బట్టిసవర్గాం, మావల మండలం, ఆదిలాబాద్ జిల్లా
మిత్తీల బాధ పోయింది
విత్తనాలు, మందు బస్తాలు, కూలీ నాలోళ్లకు పెట్టుబడి కావాలంటే మిత్తీలోళ్ల చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు కేసీఆర్ సార్ వల్ల బాధలు పోయినయి. రైతుబంధు పైసలు టైంకు ఏత్తుండు. ఇన్నాళ్లు పడ్డ బాధలన్నీ పోయాయి. కూలి పైసలు ముందుగా ఇత్తేనే వత్తామని కూలోళ్లు అన్నరు. మంచి టైంకు కేసీఆర్ సారు రైతుబంధు పైసలు ఏసిండు. ఆ పైసలే కూలోళ్లకు ఇచ్చి మిరపకాయలు ఏరిత్తున్న. ఊళ్లె మా ఇద్దరి పేరు మీద 4 ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు పైసలు 20 వేలు పడ్డయయి. నాడు మిత్తీలకు తెచ్చిన పైసలు పంటలు పండకుంటే వాటిని కట్టకపోయేటోళ్లం. తెచ్చిన అప్పులకు మిత్తీలకు మిత్తీలు పెరిగేది. మళ్ల పంటలు పండితేనే అప్పులు తీర్చేటోళ్లం. ఇప్పుడు ఆ బాధలు పోయినయి. కేసీఆర్ సారు మాలాంటోళ్లకు బాగానే చేత్తుండు.
-కోల మణెమ్మ, అన్సాన్పల్లి, మల్హర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా