గార్ల, జూన్ 17 : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద రూ.204 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పాలేరు లింక్ కెనాల్ సర్వేను వెంకటాపురం వద్ద రైతులు అడ్డుకున్నారు. వందలాది మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు బుధవారం తెల్లవారుజామున వచ్చారు. కంసలితండా, వెంకటాపురం గ్రామాల వద్ద సర్వేకు యత్నించగా రైతులు అడ్డుకున్నారు. వెంకటాపురం వద్ద 140 మీటర్ల వెడల్పుతో ప్రారంభమైన లింక్ కెనాల్ చలివాగు నుంచి 100 మీటర్లు, మర్రిగూడెంవద్ద 240 మీటర్లతో కెనాల్ నిర్మాణం చేపడుతామని సర్వే బృందం వెల్లడించింది. సర్వేకు గార్ల తహసీల్దార్ శారద, డోర్నకల్ తహసీల్దార్ రాఘవరెడ్డి, సర్వేయర్లతోపాటు 200 మంది పోలీసులు వచ్చారు.
మరోవైపు గార్ల మండలంలో మున్నేరు జలసాధన కమిటీ ముఖ్య నాయకులను తెల్లవారుజామున 6 గంటలకే పోలీసులు నిర్బంధించారు. పోలీసులు, రెవెన్యూ ఆధికారులు కంసలితండా భూముల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో చేరిన రైతులు భూముల వైపు అధికారులు వెళ్లకుండా, సర్వే చేయకుండా అడ్డుకుని నిలదీశారు. మహబూబాబాద్ ఆర్డీవో రాజేశ్వరి రైతులతో మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం అందించేలా కృషిచేస్తామని తెలిపారు. కారేపల్లి ఏన్కూర్, ఖమ్మం అర్బన్ మండలాల్లో ఎకరాకు రూ. 28 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రైతులతో చర్చలు జరిపి పరిహారం డబ్బులు అందిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా రైతులు అంగీకరించలేదు.
‘మా ప్రాణాలు పోయినా.. మా భూములు మాత్రం ఇవ్వం’ అని తేల్చిచెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మున్నేరు నీటిని పరీవాహక ప్రాంతాలకు అందించకుండా పాలేరుకు తరలించేందుకు జీవో జారీ చేసిందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. గార్ల మండలంలో ఎకరం భూమికి నీరివ్వకుండా పాలేరుకు తరలించి అక్కడి నుంచి సత్తుపల్లి, సూర్యాపేటకు తరలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్‌నాయక్, టీవీకే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వం, సీపీఎం రాష్ట్ర నాయకుడు కందునూరి శ్రీనివాస్‌రావు, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్‌రావు, నాయకులు రమేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.