Rolla Vagu | జగిత్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్టర్లు బిగించి, అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉన్నది. ఆ రెండూ పూర్తిచేస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే నాటి బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రాజెక్టుకు షెట్టర్లు బిగించేందుకు, అటవీశాఖ అనుమతిని సాధించలేక కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఒకవైపు, ఇక్కడి ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు దిగాలుపడుతున్నారు.
ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో, జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించి, పంటలను స్థిరీకరించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. రూ.136 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 95 శాతం మేర పూర్తిచేసింది. బీర్పూర్ మండలంలోని 6 వేల నుంచి 8 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్, కొల్వాయి, చర్లపల్లి, కండ్లపల్లి, రంగసాగర్, మంగెళ, తాళ్లధర్మారం, కమ్మునూరు గ్రామాలకు సాగునీరు అందుతుంది. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురిలోని దొంతాపూర్, తీగల ధర్మారం, దమ్మన్నపేట, రాజారం, జైన, నక్కలపేట, తుమ్మెనాల, మగ్గిడి గ్రామాల పరిధిలోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది.
రోళ్లవాగు బీర్పూర్ అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్థలం. దీన్ని నాలుగు దశాబ్దాల క్రితం కొంత అభివృద్ధి చేసి, చిన్న ప్రాజెక్టుగా స్థిరీకరించారు. వేసవిలో నీటి లభ్యత లేని సమయంలో ఈ వాగు నీటితో నింపితే బాగుంటుందన్న ఆలోచనతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి డీ-53 కాలువను ఫీడర్ చానల్‌గా ఏర్పాటుచేశారు. 1989లో రోళ్లవాగును కొంత ఆధునీకరించి ప్రాజెక్టుకు రెండు స్లూయిజ్‌లు ఏర్పాటుచేశారు. తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టు నుంచి కాలువలను సారంగాపూర్, ధర్మపురి మండలాల పరిధిలో తవ్వించారు. ఈ ప్రాజెక్టుకు లక్ష్మీనృసింహస్వామి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును మరింత మెరుగు పరిచేందుకు, ఆధునీకరించేందుకు అవకాశాలున్నాయని అధికారులు అప్పుడే ప్రతిపాదనలు రూపొందించారు. కానీ, గత పాలకులు పట్టించుకోలేదు. మూడు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ఆధునీకరణ రాజకీయ నేతలకు ఎన్నికల హామీ అంశంగానే మిగిలింది.
తెలంగాణ ఏర్పడిన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల సమయంలో ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీచేసిన కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కల్వకుంట్ల కవిత రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణకు హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు, ధర్మపురి ప్రాంతంలోని మరికొంత ఆయకట్టు స్థిరీకరణ కోసం రూ.60 లక్షలు కేటాయించి సర్వే చేశారు. 2017 మేలో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. కాలక్రమంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగి రూ.136 కోట్లకు చేరుకున్నా, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయించింది.
రోళ్లవాగు ప్రాజెక్టు పరిధిని విస్తరణ విషయంలో భూసేకరణ కీలక అంశంగా మారింది. విస్తరణకు దాదాపు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. ఇందులో 200 ఎకరాలు పట్టాదారులవి కాగా, మరో 815 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉన్నది. అంత మొత్తంలో మరో మూడు చోట్ల భూమిని గుర్తించి రిజర్వు ఫారెస్ట్‌కు అందజేసేందుకు తీర్మానించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న రిజర్వు ఫారెస్ట్‌కు డీపీఆర్‌ను పంపించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫారెస్ట్ అనుమతులు మంజూరు కాలేదు. దీంతో ప్రాజెక్టుకు షెట్టర్లు పెట్టలేకపోయారు. ఎన్నిసార్లు కేంద్రంతో విన్నవించినా, వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలోనే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 15 నెలలు గడిచినా ప్రభుత్వం రిజర్వు ఫారెస్ట్ నుంచి అనుమతులు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ప్రాజెక్టుకు షెటర్లు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 18 గ్రామాల్లో సాగునీటికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు నీరు లేక పొలాలను పశువుల మేతకు వదిలిపెట్టుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం, విస్తరణ కోసం రోళ్లవాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న సాగుభూమికి రా్రష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.7.50 లక్షల నష్టపరిహారం చెల్లించి 200 ఎకరాలను సేకరించింది. భూసేకరణ కోసమే ప్రభుత్వం రూ.16 కోట్లు వెచ్చించింది. తర్వాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచింది. సహజసిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన ఈ ప్రాజెక్టు విస్తీర్ణం పెంచుతూ, ప్రాజెక్టు చుట్టూ మూడు కట్టలు నిర్మించారు. 425 మీటర్ల పొడువు, 16 మీటర్ల ఎత్తుతో ఒక కట్ట నిర్మించగా, రెండో కట్టను 300 మీటర్ల పొడువు రెండున్నర మీటర్ల ఎత్తుతో అటవీ ప్రాంతంలో నిర్మించారు. మూడో కట్టను 860 మీటర్ల పొడవున 21 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ప్రాజెక్టులో 156 మీటర్ల పొడవున 16.50 మీటర్ల వెడల్పు, 12.50 మీటర్ల ఎత్తుతో మత్తడి నిర్మాణం పూర్తిచేశారు. ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించే డీ-53 కెనాల్ మరమ్మతులతోపాటు దాని వెడల్పును సైతం పెంచారు. రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే రెండు కాలువలనూ ఆధునీకరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేశారు. 2022 జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్ర అవరోధం ఏర్పడింది. వర్షాల వల్ల వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టులో ఇసుక, మట్టిమేటలు వేసింది. వాటన్నింటినీ తొలగించి మళ్లీ ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని డీ-53 కాలువ ద్వారా సైతం నీటిని లాంఛనంగా మళ్లించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంత రైతులకు నీళ్లందించాలని రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా రోళ్లవాగు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. అటవీ అనుమతి, షట్టర్ల బిగింపు పనులు మిగిలాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని, అనుమతి తీసుకొని, మే వరకు షెట్టర్ బిగించి, రైతులను ఆదుకోవాలి.
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్