Runa Mafi | కరీంనగర్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పెద్దపల్లి: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నది రుణమాఫీపై రేవంత్ సర్కారు వ్యవహారం. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రూ. 2లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియోజకవర్గంలోని కమాన్‌పూర్ మండలంలో 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అయినట్టు ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్‌లో తెలిసింది.
అరకొరగా లోన్లు చెల్లించి రైతాంగానికి కుచ్చుటోపీ పెట్టినట్టు వెల్లడైంది. మండలంలోని రొంపికుంట, నాగారం, తెనుగుపల్లి, పేరపల్లి, లింగాల గ్రామాలతో పాటు పెద్దపల్లి మండలంలోని సబ్బితం, రంగాపూర్ గ్రామాల్లోని అనేక మంది రైతులకు రుణమాఫీ కాక ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా సరైన సమాధానం లభించడంలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు.
ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి జిల్లాలో మొదటి విడుతలో 29,724 మంది రైతులకు రూ. 149.42కోట్లు, రెండో దఫా 13,238 మందికి రూ. 122.43 కోట్లు, మూడో విడుతలో 8,268 మందికి రూ. 101.75కోట్లు, మొత్తంగా జిల్లావ్యాప్తంగా 51,393 మంది రైతులకు రూ. 375.58 కోట్ల రుణమాఫీ చేశారు.
మాఫీ ప్రక్రియ పూర్తయిందని స్వయంగా సీఎం ప్రకటించడంతో రుణమాఫీ కానీ దాదాపు 60శాతం మంది పరిస్థితి ఏమిటని రైతులు మదనపడుతున్నారు. రొంపికుంటకు చెందిన 300మంది రైతులు పెద్దపల్లిలోని ఇండియన్ బ్యాంక్, సబ్బితంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కమాన్పూర్లోని కేడీసీసీ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఇందులో 40 శాతం మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ కాగా లక్షలోపు రుణాలు ఇంకా మాఫీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ వారిని పలకరించగా వారి మనోభావాలను ఇలా వెల్లడించారు.
మాది కాంగ్రెస్.. 40 వేలూ జెయ్యలే
నా భర్త ఓదెలు కాంగ్రెస్ కార్యకర్త. పదేండ్ల క్రితం కాలంజేసిండు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 40వేలు లోన్ తీసుకున్నా. ఇది మాఫీ అయితదని ఎదురు చూసిన. బ్యాంకోళ్ల దగ్గరికి వెళితే ఏం చెప్పడం లేదు. కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రాన్ని ఇచ్చివచ్చిన.
-ఆంజమ్మ, రొంపికుంట ( పెద్దపల్లి)
సీఎం రాజీనామా చేయాలి
రెండు గడువులు దాటినా రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదు. రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా? సంపూర్ణంగా రైతులకు రుణమాఫీ చేస్తారా? అనే విషయాన్ని తేల్చుకోవాలి. మా గ్రామంలో 150 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేయని పక్షంలో ఆందోళనకు దిగుతాం.
-కొయ్యడ రవి, రొంపికుంట, కమాన్‌పూర్
మాఫీ డబ్బులు జమ కాలేదు..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ.18వేల లోన్ తీసుకున్నా. తొలివిడుత రుణమాఫీ జాబితాలో పేరు వచ్చింది. బ్యాంకులో అడిగితే అసలు మాఫీ అయ్యిందని, వడ్డీ కట్టి, వన్ బీ పహాణీ, ఆధార్ జిరాక్స్ ఇవ్వమన్నారు.వడ్డీ రూ.1300 కట్టి, ధృవీకరణ పత్రాలు ఇచ్చిన. నెల అవుతున్న ఇంకా ప్రభుత్వం నుంచి ఖాతాకు డబ్బులు రాలేదు.
-జంగిలి శ్రావణ్‌కుమార్, రొంపికుంట
40 శాతం మందికే మాఫీ..
మా కమాన్‌పూర్ మండలంలో 40శాతం మంది రైతులకే మాఫీ అయింది. కమాన్‌పూర్ సహకార సంఘం నుంచి 34మంది, పెద్దపల్లి ఇం డియన్ బ్యాంక్ నుంచి 80 మంది, సబ్బితం లోని ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు నుంచి దాదాపు 200ల మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. రైతులను ఇబ్బంది పెట్టడం రేవంత్ సర్కారుకు తగదు.
-చిందం తిరుపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్, కమాన్‌పూర్
బ్యాంకుల్లో బారులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో యూరి యా బస్తాల కోసం గంటల కొద్ది రైతులు క్యూలైన్లో నిల్చోని ఉండేవాళ్లు. ఇప్పుడు రుణమాఫీ కోసం బ్యాంకుల ముందు గంటల తరుబడి బారులు తీరుతున్నరు. రొంపికుంటలో చానామందికి రుణాలు మాఫీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేయాలి.
-కొయ్యడ కుమార్, రొంపికుంట, కమాన్‌పూర్
కాంగ్రెస్ గొప్పలు సిగ్గుచేటు
పెద్దపల్లి ఇండియన్ బ్యాంకులో రూ. 80 వేలు లోన్ తీసుకున్న. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడతల్లో నా పేరు రాలేదు. లక్ష లోపు ఉన్న నాకు మాఫీ కాకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు. రైతులు ఆగమవుతుంటే వరంగల్‌లో రుణమాఫీ కృతజ్ఞత సభ పెడుతామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరం.
-తాళ్ల కనకయ్య, తెనుగుపల్లి, కమాన్‌పూర్
ఖాతా లెక్కలు చెప్తలేరు
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు పెద్దపల్లి ఇండియన్ బ్యాంక్‌లో రూ. లక్ష రుణం 2023 ఆగస్టులో ఒక్కసారే మాఫీ అయింది. మళ్లీ అదే బ్యాంక్‌లో 28 అక్టోబర్ 2023న రూ.52వేల లోన్ తీసుకున్న. రుణమాఫీ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా.. మూడు విడుతల్లోనూ మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే నేను 2016లో రుణం తీసుకున్నట్టు చెబుతున్నరు. నేను 2016లో రుణం తీసుకుంటే కేసీఆర్ చేసిన మాఫీ ఎటు పోయిందని అని అడిగితే కసురుకుంటున్నరు. ఖాతాలెక్కలు అడిగితే కర్సయితయ్ అంటున్నరు.
-కే రవి, రొంపికుంట, కమాన్‌పూర్
మాఫీపై సమజైతలేదు
కేసీఆర్ హయాంలో నాకున్న లోను రూ. 49వేలు వడ్డీతో రూ. 54వేలు ఒకేసారి మాఫీ అయ్యింది. మళ్లీ ఆగస్టు నెలలోనే పెద్దపల్లి ఇండియన్ బ్యాంక్‌లో రూ. 54వేలు రుణం తీసుకున్నా. రైతు రుణమాఫీకి నాకు అన్ని అర్హతలున్నాయి. కానీ మూడు లిస్ట్‌ల్లోనూ నా పేరు రాలేదు. గిట్లేందుకు అయిందో సమజైతలేదు.
-కే మల్లేశ్, రొంపికుంట, కమాన్‌పూర్
రైతులతో ఆందోళన చేస్తాం
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాఫీ చేసింది పావలా వంతు. చెప్పుకునేది రూపాయి వంతు. అర్హులందరికీ రుణమాఫీ చేయాలి. మాఫీ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం.
-ఉప్పరి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ, కమాన్‌పూర్