న్యాల్కల్, సెప్టెంబర్ 4: తమకు తెలియకుండానే ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపడుతున్నారని, ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్‌లో భూ బాధితులు, ప్రజలు అధికారులను నిర్బంధించారు. న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామ శివారులో ఏర్పాటయ్యే ఫార్మాసిటీ భూ బాధితులు, ప్రజలు బుధవారం డప్పూర్ పంచాయతీ కార్యదర్శి జైసింగ్‌ను పంచాయతీ కార్యాలయంలో గంటన్నరకు పైగా నిర్బంధించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
ఫార్మాసిటీకి సంబంధించి తనకు సంబంధం లేదని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు కలిసి ఆయనను నిర్బంధించారు. ఉన్నతాధికారులు వచ్చేదాకా విడిచేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. మండల ఇన్చార్జి ఎంపీడీవో సురేశ్ చేరుకొని వారితో మాట్లాడారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వచ్చేదాకా ఇద్దరూ కదిలేది లేదని తెగేసిచెప్పారు. తమ జీవనాధారమైన భూములను ఫార్మాసిటీకి తీసుకొని తీరని అన్యాయం చేస్తున్న విషయం ముందే తెలిసినా తమకేందుకు చెప్పడం లేదని నిలదీశారు. వెంటనే ఎంపీడీవో సురేశ్ హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు చేరుకుని నిర్బంధంలో ఉన్న ఎంపీడీవో, కార్యదర్శిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా బాధితులు, ప్రజలు అడ్డుకున్నారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు చేరుకుని నాయకులతో మాట్లాడారు. కలెక్టర్‌తో మాట్లాడేందుకు నిర్వాసితులు ఎప్పుడు వస్తారో చెప్పాలని, అప్పటిదాకా అధికారులు ఎవరూ ఇక్కడికి రారని చెప్పి ఎంపీడీవో, కార్యదర్శిని పోలీసులు విడిపించి తీసుకెళ్లారు. సమాచారం లేకుండా అధికారులు గ్రామాలకు రావద్దని నిర్వాసితులు ఎంపీడీవో, పోలీసులకు వినతిపత్రాన్ని అందజేశారు.