సంగారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రూ. 2లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామంలోని రైతుల్లో కనీసం ఒక్కరికి కూడా 2లక్షల రుణమాఫీ కాలేదు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జుల్కల్ గ్రామ పంచాయతీలో 3వేల జనాభా, 2800 ఎకరాల వ్యవసాయభూమి ఉంది.
1000 మందికిపైగా రైతులు ఉన్నారు. వీరిలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ. గ్రామంలోని 500 మందికిపైగా రైతులు కందిలోని ఎస్బీఐ, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకుంటున్నారు. రేవంత్ సర్కార్ గ్రామంలో మొదటి విడతగా 158 మంది, రెండో విడతలో 72 మంది రైతులకు రుణమాఫీ చేసింది.
మూడో విడతలో ఒక్కరికీ పంటరుణం మాఫీ కాలేదు. దీంతో గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం గ్రామంలో 70 శాతానికి పైగా రైతుల రుణాలు మాఫీ కావాలని, కానీ సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నమ్మించి మోసం చేయొద్దు
నేను కోఆపరేటివ్ బ్యాంకు లో రూ.1.94 లక్షల పంటరుణం తీసుకున్నా. రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పటంతో సంతోషపడ్డా. కానీ నాకు రూ.1.94 లక్షల పంటరుణం మాఫీ కాలేదు. ప్రభుత్వం నాలాంటి రైతులను నమ్మించి మోసం చేయడం సరికాదు.
-కొత్తగాడి నర్సింలు, జుల్కల్, సంగారెడ్డి జిల్లా
ఆశలు అడియాసలయ్యాయి
కంది కోఆపరేటివ్ బ్యాం కులో రూ.2 లక్షల పంటరుణం తీసుకున్న. అర్హత ఉన్నా నాకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకాలు అన్నీ ఉన్నాయి. రేవంత్ సర్కార్ నా ఆశలను అడియాసలు చేసింది. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి.
-కలివేముల పాండు,జుల్కల్, సంగారెడ్డి జిల్లా
రేషన్‌కార్డు లేకుంటే మాఫీ చేయరా?
దుమ్ముగూడెం సహకార బ్యాంకులో రెండేండ్ల క్రితం రూ.18 వేల పంట రుణం తీసుకున్నాను. మూడు విడతల్లోనూ నా పేరు రాలేదు. బ్యాంకు సిబ్బందిని అడిగితే సమాచారంలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులనూ సంప్రదించాను. మా నాన్న రేషన్‌కార్డులో నా పేరు ఉందని చెప్పారు. నాకు సపరేట్ రేషన్‌కార్డు లేనంత మాత్రాన నా పంట రుణాన్ని మాఫీ చేయరా?
-కాశిబోయిన సతీశ్, బండిరేవు, దుమ్ముగూడెం
దండం పెడతా.. మాఫీ చేయండి
మా కుటుంబంలో మా అమ్మకు, నాకు పంట రుణం ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు వేర్వేరుగా ఉన్నాయి. మూడు విడతల్లోనూ మాకు లోన్ మాఫీ కాలేదు. అటు రైతుభరోసా ఇవ్వక, ఇటు రుణమాఫీ కాక కష్టాలు పడుతున్నాం. రుణమాఫీ చేస్తే మళ్లీ రుణం తీసుకొని పంటలు సాగు చేసుకుంటాం కదా? సీఎం గారూ.. మీకు దండం పెడతాం.. మా రుణాలు మాఫీ చేయండి.
-మాలోత్ పూల్‌సింగ్, మంగ్యాతండా, టేకులపల్లి
రెన్యువల్ చేసినా రుణమాఫీ కాలె
2019లో రూ.2 లక్షల రుణం తీసుకున్న. అప్పటి నుంచి ఏటా మిత్తి చెల్లించి రెన్యువల్ చేస్తున్నా. మూడు రోజుల క్రితం రూ.2 లక్షల్లోపు రుణమాఫీ అయినట్టు తెలిసి బ్యాంకుకు వెళ్లి అడిగితే మాఫీ కాలేదని చెప్పిన్రు. మా గ్రామంలో చాలామంది రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు. రుణమాఫీ చేసి నాకు న్యాయం చేయాలి.
– కూకట్ల వీరన్న, పోచారం, మహబూబాబాద్ జిల్లా
మేం రైతులం కాదా? మాకెందుకు మాఫీ కాదు
నా భర్త ప్రభాకర్ పేరున రూ.2 లక్షలు తీసుకున్నం. దానికి వడ్డీ కలిపితే రెండు లక్షలు దాటుతది. వడ్డీ పైసలు కడుతామని బ్యాంకుకు పోతే పట్టించుకునే వారే లేరు. కొందరికే మాఫీ అయితే ఎలా? మేం రైతులం కాదా?
– కొత్తూరు తిరుపతమ్మ, జంగాలపల్లి, ములుగు జిల్లా
మా ఇంట్లో ఎవరికీ మాఫీ చేయలే..
మా ఇంట్లో నేను, నా భార్య రాజ్యలక్ష్మి, కొడుకులు సేనాపతి, సతీశ్ ఉంటున్నాం. అందరికీ ఒకటే రేషన్ కార్డు ఉన్నా, వేర్వేరుగా ఉంటున్నాం. పట్టాపాస్ పుస్తకాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో చేసిన రుణమాఫీలో మాలో ఒక్కరికి కూడా కాలేదు. నా పేరు మీద రూ.1.50 లక్షలు, నా భార్య పేరు మీద రూ.2.74 లక్షలు, నా కొడుకు సతీశ్ పేరున రూ.98 వేలు, సేనాపతి పేరుమీద రూ.1.10 లక్షల రుణం ఉన్నది. మాలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలె. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినం. వ్యవసాయ అధికారులను కలిసినం. ఎవరూ సమాధానం చెప్పడం లేదు. మా లెక్క మా ఊరిలో చాలామంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.
– మారెల్ల కొమురయ్య రైతు, కాశీంపల్లి, భూపాలపల్లి