భువనగిరి అర్బన్, జనవరి 25 : ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు ముందస్తుగా డీసీపీ వద్ద అనుమతి తీసుకొని శుక్రవారం ఏర్పాట్లు చేశారు. కాగా, శనివారం తెల్లవారేసరికి ధర్నా ప్రాంతంలోని టెంట్లు, కార్పెట్లను పోలీసులు ఎత్తేశారు. కలెక్టరేట్‌లోకి రైతులు వెళ్లకుండా భువనగిరి-రాయగిరి రహదారిలో బారికేడ్లు, ఇనుప కంచె వేసి దిగ్బంధించారు. దీంతో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులతో కలిసి ట్రిపుల్ బాధిత రైతులు రోడ్డుపైనే ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి అనుమతి కోరగా పోలీసులు అడ్డుకొని తోసేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్‌ను డీసీపీ రాజేశ్చంద్ర అడ్డగించారు. రైతుల సమస్యను అధికారులకు విన్నవించుకునే అవకాశం కల్పించకపోతే ఎలా అని పైళ్ల ప్రశ్నించడంతో కేవలం నలుగురికి అవకాశం ఇచ్చారు. దీంతో ఇద్దరు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, క్యామ మల్లేశ్ కలెక్టరేట్‌లోకి వెళ్లారు. అప్పటికే కలెక్టరేట్లో ఉన్న ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చుతానని ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రియాంకగాంధీ చేసిన వాగ్ధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని విమర్శించారు. మాయమాటలతో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి రైతుల గోసపై సోయిలేదని మండిపడ్డారు.